‘బంగ్లా’ సినిమా చూద్దాం రండి | Bangladesh Film Festival Starts From February 21st In Sarathi Studios | Sakshi
Sakshi News home page

‘బంగ్లా’ సినిమా చూద్దాం రండి

Published Thu, Feb 20 2020 9:58 AM | Last Updated on Thu, Feb 20 2020 9:58 AM

Bangladesh Film Festival Starts From February 21st In Sarathi Studios - Sakshi

సాక్షి, శ్రీనగర్‌కాలనీ: సినిమా..సినిమా...ఈ మాధ్యమం ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని, విలువలను, వాస్తవాలను తెలుసుకోవచ్చు. ఒక్కో భాషకు, ఒక్కో ప్రాంతానికి భిన్నమైన సంస్కృతి–సంప్రదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని సినిమాలను చూసి పలు భిన్న కోణాలను తెలుసుకోవాలనే తపన కొందరికి ఉంటుంది. అయితే తీరిక దొరకదు.. దొరికినపుడు సినిమాలు దొరకవు. అందుకే సినిమాలను చూపిస్తూ, సినిమా అభిమానుల మనోగతాన్ని తెలుసుకొని ఆ దిశగా హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌ తన ఆశయాలను కొనసాగిస్తోంది. విభిన్న సంస్కృతి– సంప్రదాయాలు, జీవనవిధానంతో కూడిన బంగ్లాదేశ్‌ ఫిలిం ఫెస్టివల్‌ను నగరవాసులకు అందిస్తున్నారు.

1999లో యునెస్కో ప్రాంతీయ భాషా చిత్రాలను పోత్సహించేందుకు ఫిబ్రవరి 21వ తేదీని ఇంటర్నేషనల్‌ మదర్‌ లాంగ్వేజ్‌ డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌– సారథి స్టూడియోస్‌ సంయుక్త ఆధ్వర్యంలో  బంగ్లాదేశ్‌కు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. భావోద్వేగాలు మనుషుల మధ్య బంధాలు, సమాజంలోని ప్రధానాంశాలు, సుఖాలు, దుఃఖాలు, కళాత్మక జీవనాన్ని, సృజనాత్మకతను ప్రస్తావిస్తూ వైవిధ్యమెన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 21వ తేదీనుంచి నాలుగు రోజులపాటు 4 బంగ్లాదేశీ చిత్రాలను ప్రదర్శించనున్నారు. రోజూ సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన ఉంటుంది. ఇన్‌ స్ప్రింగ్‌ బ్రీజ్, కోమల రాకెట్, స్క్రీన్‌ ప్లే యువర్స్‌ ఢాకా, ఆల్ఫా సినిమాలను ప్రదర్శిస్తారు. 

ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తాం
ఇంటర్నేషనల్‌ మదర్‌ లాంగ్వేజ్‌ డే సందర్భంగా బంగ్లాదేశ్‌ ఫిలిం ఫెస్టివల్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌– సారథి స్టూడియోస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నాం. అకాడమీ అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. æహైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌ మొదలై 46 సంవత్సరాలు అయింది. భవిష్యత్‌లో తెలుగు ఫిలిం ఫెస్టివల్స్‌ను ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నిర్వహిస్తాం.
– ప్రకాష్‌రెడ్డి,  హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌ సెక్రటరీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement