ఐదుగురితో.. అనుష్క | big picture, directed by the bala | Sakshi
Sakshi News home page

ఐదుగురితో.. అనుష్క

Published Tue, Nov 17 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

ఐదుగురితో.. అనుష్క

ఐదుగురితో.. అనుష్క

బాల దర్శకత్వంలో భారీ చిత్రం!
 
రిస్క్‌లు తీసుకోవడం తమిళ దర్శకుడు బాలాకి చాలా ఇష్టం అనుకోవచ్చు. కాటి కాపరి, అఘోరా, మెల్ల కన్నోడు... ఇలా ఆయన చిత్రాల్లోని హీరోలు విచిత్రంగా ఉంటారు. హీరోయిన్లను దాదాపు డీ-గ్లామరైజ్డ్‌గానే చూపిస్తారు. హీరోలంటే హ్యాండ్‌సమ్‌గా, హీరోయిన్లంటే గ్లామరస్‌గా ఉంటేనే చూస్తారనే అభిప్రాయాన్ని పోగొట్టి, కథానుగుణంగా ఎలా ఉన్నా చూస్తారని తన చిత్రాల ద్వారా ఆయన చాటి చెప్పారు. ‘శివపుత్రుడు, నేను... దేవుడు, వాడు-వీడు’... ఇలా ఆయన తీసే ప్రతి సినిమా రిస్కే. అందులోనే ఆనందాన్ని వెతుక్కునే బాల ప్రస్తుతం ‘తారై... తప్పట్టై’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రానున్న సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బాల తన తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టారని భోగట్టా. ఆ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలెన్నో వినిపిస్తున్నాయి. ఆ విశేషాల్లోకి వెళితే... ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి, విశాల్, రానా, ఆర్య, అధర్వ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీగా దీన్ని బాల ప్లాన్ చేస్తున్నారట. ఇందులో అనుష్కను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారని వినికిడి.

వచ్చే జనవరిలో ఆరంభించాలనుకుంటున్నారట. బాల దర్శకత్వం వహించిన ‘వాడు-వీడు’లో విశాల్, ఆర్య నటించారు. ‘పరదేశి’లో అధర్వ యాక్ట్ చేశారు. అరవింద్ స్వామి, రానా, అనుష్క మాత్రం ఇప్పటివరకూ ఆయన దర్శకత్వంలో నటించలేదు. సో... వీళ్లను ఓ కొత్త కోణంలో చూడొచ్చని ఊహించవచ్చు. గతంలో తమిళంలో రూపొందిన ‘స్వయంవరం’లో ఎక్కువమంది హీరోలు నటించారు. 24 గంటల్లో తయారైన చిత్రంగా గిన్నిస్ రికార్డు సాధించిన ‘స్వయంవరం’ తర్వాత మళ్ళీ ఎక్కువమంది హీరోలు నటించనున్న చిత్రం ఇదేనని కబురు. ఇవాళ తమిళనాట అగ్ర దర్శకుల్లో బాల ఒకరు. ఇప్పటివరకూ ఆయన తీసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రం నిర్మాణ వ్యయం, తారాగణం రీత్యా మరో ఎత్తు అవుతుందని చెన్నై వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, అనుష్కకు మరో వినూత్న, భారీ ప్రాజెక్ట్ వచ్చిందన్నమాట. అనుష్క మజాకా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement