బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన అతిథులతో హౌస్ సందడిగా మారింది. గత ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ నానమ్మ రాజ్యలక్ష్మి గలగలా మాట్లాడుతూ, పంచ్‌లు విసురుతూ అందరినీ నవ్వించింది. కుదిరితే తర్వాతి సీజన్‌కు తాను కూడా వస్తానని ఉత్సాహం ప్రదర్శించింది. టాస్క్‌లు బాగా ఇస్తున్నాడని బిగ్‌బాస్‌ను మెచ్చుకోవడంతో పాటు ఇంటికి తప్పకుండా రావాలి అంటూ ఇన్వైట్ చేసింది. తర్వాత కన్ఫెషన్ రూంలో నుంచి రాహుల్ తల్లి సుధారాణి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే ఏడుపును తమాయించుకున్న రాహుల్ వెళ్లి ఆమె ఒడిలో పసిబిడ్డలా ఒదిగిపోయాడు. రాహుల్‌ను అక్కున చేర్చుకుని సుధారాణి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. బిగ్‌బాస్ ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. టాస్క్‌లు సరిగా ఆడమని సూచించింది. ‘రాహుల్.. మనసులో ఏం ఉంటుందో.. అది మొహం మీదే అనేస్తాడు. కానీ వాడి మనసు చాలా మంచిది, ఎవరూ వాడిని తప్పుగా అనుకోకండి’ అని ఇంటి సభ్యులను కోరింది.
శ్రీముఖి గెలిచేసింది
శ్రీముఖి అల్లరంటే చాలా ఇష్టమని రాహుల్ తల్లి తెలిపింది. రాహుల్.. పెదవే పలికిన మాటల్లోన పాట పాడి తల్లిపై ప్రేమ కురిపించాడు. అనంతరం తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. చివరి అతిథిగా శ్రీముఖి తల్లి లత లోనికి వస్తుండగా ఆమెను చూడగానే శ్రీముఖి కన్నీటి పర్యంతమయింది. అయితే బిగ్‌బాస్ కాస్త నాటకీయతను జోడించి శ్రీముఖి ఎమోషన్స్‌తో ఆడుకున్నాడు. కనీసం కళ్లారా చూడకముందే లతను బయటికి పంపించేయడంతో శ్రీముఖి వెక్కివెక్కి ఏడ్చింది. కన్నీళ్లు ధారలు కడుతుండగా మళ్లీ ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే లేడిపిల్లలా చెంగుచెంగున పరుగెత్తుకు వెళ్లి గట్టిగా హత్తుకుని ఏడుపు లంకించుకుంది. శ్రీముఖి తల్లి ఆమెను ఓదారుస్తూ.. ‘డాన్సు ఇరగదీస్తున్నావ్.. ఎవరు ఏమన్నా నువ్వు పడుతున్నావ్ తప్ప తిరిగి మాటలు అనట్లేదు.. అక్కడే నువ్వు గెలిచావ్, నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని సంతోషించింది.
‘బయట చిన్నపిల్లోడి నుంచి ముసలోడి వరకు అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నువ్వు లేనిది బిగ్‌బాస్ హౌసే లేదు’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. నిజామాబాద్ అమ్మాయిలు దుమ్ము లేపుతున్నారు అంటూ శ్రీముఖి, శివజ్యోతిలను పొగడ్తలతో ముంచెత్తింది. రాహుల్‌తో మాట్లాడుతూ.. మాట్లాడుకోండి, పోట్లాడకండి అని చురకలు అంటించింది. ఇక బాబా భాస్కర్ కామెడీ వెగటు పుట్టించింది. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ‘రామకృష్ణ సేమ్ పీస్ పట్టారు’ అని సెటైర్ వేశాడు. కిచెన్‌లో ఆమె కోసం పాట పాడారు. ఇక ఆయన కుళ్లు కామెడీ భరించలేక వితిక, శివజ్యోతిలు ఆపండి మాస్టర్ అంటూ హెచ్చరించారు. వచ్చిన ప్రతీ అతిథి ఒక్కో స్టార్‌ను ఇవ్వడంతో బిగ్‌బాస్ హోటల్ సెవన్ స్టార్ హోటల్‌గా మారింది. దీంతో నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment