‘బ్లఫ్‌ మాస్టర్‌’ మూవీ రివ్యూ | Bluff Master Telugu Movie Review | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 12:25 PM | Last Updated on Fri, Dec 28 2018 12:59 PM

Bluff Master Telugu Movie Review - Sakshi

టైటిల్ : బ్లఫ్‌ మాస్టర్‌
జానర్ : క్రైమ్‌ థ్రిల్లర్‌
తారాగణం : సత్యదేవ్‌, నందిత శ్వేత, ఆదిత్య మీనన్‌, సిజ్జు, వంశీ
సంగీతం : సునీల్‌ కాశ్యప్‌
దర్శకత్వం : గోపి గణేష్‌
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్‌, పి. రమేష్‌

సపోర్టింగ్‌ రోల్స్‌తో వెండితెరకు పరిచయం అయిన సత్యదేవ్‌, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మి సినిమాతో లీడ్‌ యాక్టర్‌గా మారాడు. తరువాత కూడా క్షణం, ఘాజీ, అంతరిక్షం లాంటి సినిమాలతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకొని మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన శతురంగవేట్టై సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ  సినిమాతో సత్యదేవ్‌ హీరోగా సక్సెస్‌ సాదించాడా..?

కథ‌ :
ఉత్తమ్‌ కుమార్‌ (సత్యదేవ్‌) ఏడేళ్ల వయస్సులో తన తల్లిదండ్రుల మరణంతో సమాజం మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇక్కడ బతకాలంటే డబ్బు కావాలనే ఉద్దేశంతో.. ఆ డబ్బు కోసం ఎలాంటి మోసం చేయడానికైనా సిద్ధపడతాడు. మనం నమ్మి చేసేది ఏది మోసం కాదని భావించే ఉత్తమ్‌ రకరకాల పేర్లతో ఎన్నో మోసాలు చేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బుతో సాక్షాలను, లాయర్లను కొని బయట పడతాడు. ఇలా అడ్డదారిలో వెళుతున్న ఉత్తమ్ మంచి వాడిగా ఎలా మారాడు..? ఉత్తమ్‌ జీవితంలోకి వచ్చిన అవని ఎవరు..? ఆమె రాకతో ఉత్తమ్‌ ఎలా మారాడు..? మంచి వాడిగా మారిన ఉత్తమ్‌కు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
సినిమా అంతా సత్యదేవ్‌ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మాటలతో మాయ చేసి మోసం చేసే పాత్రలో సత్యదేవ్‌ నటన వావ్‌ అనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మోసగాడిగా కన్నింగ్ లుక్స్‌లో మెప్పించిన సత్య, సెకండ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అంతే బాగా ఆకట్టుకున్నాడు. అవని పాత్రలో నందితా శ్వేత ఒదిగిపోయింది. ఫస్ట్‌ హాఫ్‌లో ఆమె నటన కాస్త నాటకీయంగా అనిపించినా.. సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌తో మంచి మార్కులు సాధించింది. ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్‌, సిజ్జు, వంశీ, చైతన్య తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :
తమిళ సినిమా శతురంగవేట్టైని తెలుగులో రీమేక్‌ చేసిన దర్శకుడు గోపీ గణేష్ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తీర్చిదిద్దటంలో సక్సెస్‌ సాధించాడు. అసలు కథలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. కథనంలో తన మార్క్‌ చూపించాడు. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ పేరుతో డ్యూయెట్లు, ఫైట్లు ఇరికించకుండా సినిమాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్టుగా అనిపించినా ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెడ్డటంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాకు మరో బలం డైలాగ్స్‌ చాలా డైలాగ్స్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా గుర్తుండిపోయేలా ఉన్నాయి. సునీల్‌ కాశ్యప్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
సత్యదేవ్‌
డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
అక్కడక్కడా నెమ్మదించిన కథనం

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement