అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! | BOLLYWOOD ACTRESS EXITS ON HER MOVIES | Sakshi
Sakshi News home page

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!

Published Sun, Feb 3 2019 3:28 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

BOLLYWOOD ACTRESS EXITS ON HER MOVIES - Sakshi

ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్‌, శ్రద్ధాకపూర్‌, కియారా అద్వానీ

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు ఆత్రేయ. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో నటీనటుల ఎంపికకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సినిమాకు కొబ్బరికాయ కొట్టేప్పుడు ఉన్న స్టార్లు పూర్తయ్యాక గుమ్మడికాయ కొడతారన్న గ్యారంటీ లేకుండా పోయింది. ‘ఈ సినిమా మనదే’ అని అనుకున్న తారల స్థానంలో అనుకోకుండా వేరే తారలు రావడం జరుగుతోంది. యాహూ అంటూ సినిమాను స్టార్ట్‌ చేసిన తారలు తూచ్‌ అంటూ మధ్యలోనే తారుమారు అవుతున్నారు. ఇటీవల అలా ఒకరి ప్లేస్‌లోకి మరొకరు రీప్లేస్‌ అయిన స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

ప్రియాంకా పెళ్లి... సల్మాన్‌ లొల్లి
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ప్రియాంకా పెళ్లి సల్మాన్‌కు తలనొప్పి పుట్టించింది. ‘రేస్‌ 3’ సినిమాతో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత సల్మాన్‌ఖాన్‌ ‘భారత్‌’ అనే సినిమాను స్టార్ట్‌ చేశారు. ఇందులో ప్రియాంకా చోప్రాను కథానాయికగా తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత ‘భారత్‌’ సినిమా కోసం ప్రియాంకా బాలీవుడ్‌కు తిరిగొచ్చారు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ‘భారత్‌’ సినిమా నుంచి ప్రియాంకా తప్పుకున్నట్లు ఈ చిత్రదర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ప్రకటించారు. కారణం ఏంటి? అంటే.. ప్రియాంకా పెళ్లి అన్నారు. నా సినిమానే వదులుకుంటుందా? అని సల్మాన్‌ ఫీలయ్యారనే వార్తలు వచ్చాయి. ప్రియాంక, సల్మాన్‌ మధ్య వాదన కూడా జరిగిందట. ఆ తర్వాత ప్రియాంకా పెళ్లి బాజాలకు ఈ వివాదం వినిపించకుండాపోయింది. ఇక ‘భారత్‌’లో ప్రియాంకా స్థానాన్ని కత్రినా కైఫ్‌తో భర్తీ చేశారు. కొరియన్‌ చిత్రం ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కి హిందీ రీమేక్‌ అయిన ‘భారత్‌’ చిత్రం రంజాన్‌కు విడుదల కానుంది.

ఏబీసీడీ.. కత్రినా నాట్‌ రెడీ
‘భారత్‌’ సినిమాకు తొందరగా గుమ్మడికాయ కొట్టి ‘ఏబీసీడీ 3’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రానికి వరుణ్‌ ధావన్‌తో కలిసి స్టెప్పులేద్దామనుకున్నారు కత్రినా కైఫ్‌. కానీ కత్రినా ఊహ నిజం కాలేదు. ఫలితంగా ‘ఏబీసీడీ 3’ చిత్రం నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే.. హఠాత్తుగా ‘భారత్‌’ సినిమాకి డేట్స్‌ ఇవ్వడంతో ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారం ‘ఏబీసీడీ’కి అడ్జస్ట్‌ చేయలేకపోయారు. దాంతో కత్రినా ప్లేస్‌లో శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. దర్శకుడు రెమో డిసౌజా ‘ఏబీసీడీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న థర్డ్‌ పార్ట్‌ ఇది. రెండోపార్ట్‌లో కూడా వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్‌నే నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

కియారాకి కుదిరింది
‘అర్జున్‌రెడ్డి’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు అనే వార్త రాగానే హీరోగా ఎవరు నటించబోతున్నారు? అని చర్చలు మొదలయ్యాయి. ఫైనల్‌గా ‘కబీర్‌సింగ్‌’ (హిందీ టైటిల్‌)గా షాహిద్‌కపూర్‌ ఫిక్స్‌ అయ్యారు. హీరోగా షాహిద్‌ ఓకే కాగానే హీరోయిన్‌ ఎవరు? అనే టాపిక్‌ ఊపందుకుంది. అనన్యా పాండే అనే ఓ కొత్తమ్మాయి పేరు స్ట్రాంగ్‌గా వినిపించింది. ఇంతలో ఆమె హిందీలో తొలిసారి సైన్‌ చేసిన టైగర్‌ష్రాఫ్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ దిఇయర్‌ 2’ సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. దీంతో ‘కబీర్‌ సింగ్‌’ చేయి పట్టుకునే అవకాశం అనన్యకు కుదర్లేదు. కియారా అద్వానీకి కుదిరింది. సెట్‌లో షాహిద్‌కు జోడి కట్టింది. తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్‌ సందీప్‌ వంగానే ‘కబీర్‌ సింగ్‌’కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు.
 
అనన్యా పాండే

హౌస్‌లోకి ఎంట్రీ
హౌస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో రాబోతున్న ఫోర్త్‌ పార్ట్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’. సాజిద్‌ ఖాన్‌ దర్శకునిగా ఈ సినిమా మొదలైంది. ఆ తర్వాత సాజిద్‌పై ‘మీటూ’ ఆరోపణలు రావడంతో ఈ సినిమా డైరెక్షన్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫర్హాద్‌–సామ్జీ ద్వయం మిగిలిన పార్ట్‌ను కంప్లీట్‌ చేశారు. కానీ సాజిద్‌ ఎదుర్కొన్నట్లే సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపికైన నానా పటేకర్‌పై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన హౌస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కట్‌ చేస్తే హౌస్‌లోకి రానా ఎంటర్‌ అయ్యారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

రానా

సౌత్‌లో...ముందు ఇద్దరు.. చివరికి ఒకరు
ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఆనంత్‌ మహదేవన్, ఆర్‌. మాధవన్‌ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారికంగా చిత్రబృందం పేర్కొంది. కట్‌ చేస్తే ఈ చిత్రానికి మాధవన్‌ ఒక్కరే దర్శకునిగా ఉంటారని ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. ఇక అనంత్‌ మహదేవన్‌ తప్పుకున్నట్లే కదా. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

మాధవన్‌

నో డైరెక్టర్‌
డైరెక్టర్‌ లేకుండా సినిమా సంపూర్తి కాదు. కానీ డైరెక్షన్‌ క్రెడిట్‌ లేకుండా మాత్రం సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దటీజ్‌ మహాలక్ష్మి’. బాలీవుడ్‌ హిట్‌ ‘క్వీన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమాకు తొలుత నీలకంఠ దర్శకుడు. ఆ తర్వాత ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌వర్మ ఇదే సినిమాకు డైరెక్షన్‌ చైర్‌లో కూర్చొన్నారు. కారణం ఏమిటంటే.. ‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌’ వల్ల నీలకంఠ తప్పుకున్నారట. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమా టీజర్‌లో దర్శకుడి పేరు లేదు. ఇదే సీన్‌ గతేడాది శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘రారా’ సినిమా విషయంలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.

సెట్స్‌పైకి వెళ్లక ముందే!
చిరంజీవి ‘సైరా’ సినిమాకు ముందు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఏ ఆర్‌ రెహమాన్‌ని తీసుకున్నారు. ప్రస్తుతం అమిత్‌ త్రివేది సంగీతం ఇస్తున్నారు. అన్నీ కుదిరితే రామ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌ పైకి వెళ్లాల్సింది. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ తేజ డైరెక్షన్‌ నుంచి క్రిష్‌ డైరెక్షన్‌లోకి మారిన విషయం తెలిసిందే. ‘సంఘమిత్ర’ కోసం శ్రుతీహాసన్‌ ప్లేస్‌లో దిశా పాట్నీ వచ్చారు. ‘కాప్పాన్‌’లో అల్లు శిరిష్‌ చేయాల్సిన పాత్రను ఆర్య చేస్తున్నారు. ఈ పాత సంగతులన్నీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి. డేట్స్‌ కుదరకో, పారితోషికం విషయంలో లెక్క కుదరకో, ముందు ఒప్పుకున్న కమిట్‌మెంట్స్‌ కారణంగానో ఇలా ఒకరి స్థానంలోకి మరొకరు రావడం జరుగుతుంది. అంతేకదా.. అనుకున్నవన్నీ జరిగితే డ్రామా ఏం ఉంటుంది? సినిమాలో అయినా జీవితంలో అయినా డ్రామా కామన్‌.

ఊరించి.. ఉసూరుమనిపించి
బాలీవుడ్‌లో తాïప్సీ హవా బాగానే కొనసాగుతోంది. ఆమె నటించిన ‘తడ్కా, బద్లా’ అనే హిందీ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇటీవల ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’(1978) అనే సినిమా రీమేక్‌లో నటించే అవకాశం ఆమెకు చేజారిపోయింది. ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నారు. ఆనన్యా పాండే, భూమి ఫడ్నేకర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో ఆనన్య పాత్రను తాప్సీకే ఆఫర్‌ చేశారు చిత్రబృందం. తీరా సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి లిస్ట్‌లో తాప్సీ పేరు లేదు. దీంతో తాప్సీ తన అవేదనను వ్యక్తం చేశారు. టీ సిరీస్‌–బీఆర్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకీ తాప్సీని లిస్ట్‌లోంచి ఎందుకు తీసేసినట్లు అంటే.. ఈ నిర్మాతలతో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించిన ‘సోను కే టిట్టు కీ స్వీటీ’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్, అనన్య లవ్‌లో ఉన్నారని, కార్తీక్‌ కోరిన మీదటే తాప్సీ ప్లేస్‌లో ఆనన్య వచ్చిందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


మార్పులు.. చేర్పులు!
గత నెల 25న ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రం విడుదలైంది. టైటిల్‌ పాత్రలో కంగనా రనౌత్‌ నటించారు. తొలుత ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. షూట్‌ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అయిపోయిందన్న టైమ్‌లో డైరెక్షన్‌ చైర్‌లో కంగనా కూర్చున్నారు. క్రిష్‌ ‘యన్‌.టీ.ఆర్‌’ బయోపిక్‌ సినిమాతో బిజీగా ఉండటం వల్ల కంగనా మెగాఫోన్‌ పట్టారని చెప్పుకొచ్చారు టీమ్‌. అంతలోనే ఈ సినిమా నుంచి సోనూ సూద్‌ తప్పుకున్నారు. ఈ ప్లేస్‌లో మహ్మద్‌ అయూబ్‌ను తీసుకున్నారు. వెంటనే స్వాతి సెమ్‌వాల్‌ తప్పుకున్నారు. సోనూ, స్వాతి కంటే ముందు ఈ సినిమా ఎడిటర్‌ తప్పుకున్నారని తెలిసింది. ఇలా పలు రీప్లేస్‌మెంట్లతో  ‘మణికర్ణిక’ షూటింగ్‌ పూర్తయింది. కానీ డైరెక్షన్‌ క్రెడిట్‌నే కంగానా కూడా షేర్‌ చేసుకున్నారు. ‘యన్‌.టీ.ఆర్‌: కథానాయకుడు’ సినిమా రిలీజ్‌ వరకు ఈ విషయం గురించి మాట్లాడని క్రిష్, ఆ తర్వాత కంగనాపై విమర్శలవర్షం కురిపించారు. డైరెక్షన్‌ క్రెడిట్‌కు ఆమెకు అర్హత లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలోని మేజర్‌ టీమ్‌ అంతా క్రిష్‌కు మద్దుతు తెలిపారు. నిర్మాత కమల్‌జైన్‌ మాత్రం కంగనా వైపు ఉన్నట్లు తెలుస్తోంది.  ‘‘క్రిష్‌ చెప్పిన మాటలను నిరూపించుకోవాలి. ‘మణికర్ణిక’ సినిమాకు చెందిన ముఖ్య నిర్ణయాలను నేనే తీసుకున్నా. ఈ చిత్రానికి నేనే దర్శకురాలిని’’ అని కంగనా అన్నారని బాలీవుడ్‌లో తాజాగా కథనాలు వస్తున్నాయి. మరి... ఈ వివాదం ఎప్పుడు ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

క్రిష్‌, కంగనా రనౌత్‌

– ముసిమి శివాంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement