
మిసెస్ పరాంకుశమే ఈ జ్యోతిలక్ష్మి
‘‘ నాకు చాలా ఇష్టమైన స్క్రిప్టు ఇది. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు తన 19వ ఏట రాసిన ‘మిసెస్ పరాంకుశం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించా. కానీ ఈ ట్రెండ్‌కు తగ్గట్టు మార్పులూ చేర్పులూ చేశాను’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో చార్మి ప్రధాన పాత్రలో సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ -‘‘కళ్లు మూసి తెరిచే లోపు ఈ సినిమా పూర్తయిపోయింది. నేను నిజజీవితంలో ఎలాగైతే ప్రవరిస్తానో, ఈ సినిమాలో అలాగే చేశాను.
ఈ సినిమాలో నేను జీవించానంతే’’ అని తెలిపారు. ‘‘మహిళల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలకు అద్దం పట్టే సినిమా ఇది. పూరి గారు ఇప్పటిదాకా చేసిన సినిమాలకు చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని గేయ రచయిత భాస్కర భట్ల అన్నారు. ఈ నెల 17న చార్మి పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్‌ను లాంచ్ చేయనున్నామని, ఈ నెలాఖరులో పాటలను, జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు పీజీ విందా, బీఏరాజు తదితరులు పాల్గొన్నారు.