మల్లిక ఆగమనం షురూ!
వేశ్య పాత్ర పోషించడం అంటే ఆషామాషీ విషయం కాదు. అదొక సవాల్ లాంటిది. ఆ సవాల్‌ని ఈ తరంలో రాణి ముఖర్జీ, టబు, అనుష్క వంటి తారలు జయించారు. ఇప్పుడు చార్మి వంతు. వాస్తవానికి వేశ్య పాత్రలంటే ఈ ముద్దుగుమ్మకు అంత ఆసక్తి లేదు. మూడు, నాలుగు ఆఫర్లు వచ్చినా తిరస్కరించేశారు. కానీ ఈసారి మాత్రం పచ్చజెండా ఊపారు. కారణం దర్శకుడు చందు చెప్పిన కథ నచ్చడం, ఆయన దర్శకత్వం వహించిన ‘టెన్త్ క్లాస్, నోట్‌బుక్’ సినిమాలు ఆమెను ఇంప్రెస్ చేయడం.
ఏ ముహూర్తాన ఈ చిత్రానికి ‘ప్రేమ ఒక మైకం’ అని టైటిల్ పెట్టారో కానీ చార్మి ప్రతి ఫొటో నిజంగానే కుర్రకారుని మత్తెక్కించే విధంగానే ఉంది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. హైక్లాస్ వేశ్య మల్లికగా చార్మి ఒదిగిపోయిన వైనాన్ని దర్శకుడు చందు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు, ఉద్వేగానికి గురయ్యానని, పులగం చిన్నారాయణ రాసిన మాటలు అద్భుతంగా ఉన్నాయని చార్మి చెప్పారు.
టూరింగ్ టాకీస్ పతాకంపై డి. వెంకటసురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఒక వేశ్య, ఓ రచయిత, ఓ గాయని.. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని, మల్లిక పాత్రకు చార్మి ప్రాణం పోశారని నిర్మాతలు తెలిపారు. రచయితగా ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, గాయనిగా ‘ప్రేమిస్తే’ శరణ్య నటించారు. చంద్రమోహన్, రవిబాబు, రావు రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్సార్ పాశోమ్-ప్రవీణ్, కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి.