ఇది నా బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తున్నా
– చిరంజీవి
‘‘రామ్‌చరణ్‌కి శర్వానంద్ స్నేహితుడు. చిన్నప్ప ట్నుంచీ అతణ్ణి చూస్తే హీరో మెటీరియల్ అనిపించేది. కానీ, చాలా సౌమ్యంగా ఉండే శర్వా హీరో అవుతాడనీ, తనకి సినిమాలపై ఆసక్తి ఉందనీ అనుకోలేదు. ఓ రోజు చరణ్ సినిమాలపై శర్వా ఆసక్తి గురించి చెప్పాడు. తర్వాత ఓ వాణిజ్య ప్రకటనలో తొలిసారి నాతో కెమేరా ఫేస్ చేశాడు. నాపై తనకి ఎంత గౌరవం, ప్రేమ అంటే... ‘ఐదో తారీఖు’ సినిమా ప్రారంభించినప్పుడు నా ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్లనని మా ఇంట్లోనే కూర్చున్నాడు. తను ఇంత సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవడం సంతోషం. ఈ విజయం నా బిడ్డకి దక్కిన విజయంగా భావిస్తున్నా’’ అన్నారు ప్రముఖ హీరో చిరంజీవి.
(ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి)
శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’ సక్సెస్‌మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిం ది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి చేతుల మీదుగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌కి సన్మానం జరిగింది. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ – ‘‘వన్, టు, త్రీలలో ఈ చిత్రానికి ఏ స్థానం అని నేను చెప్పలేను. ఇట్స్ టూ ఎర్లీ. అంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రబృందానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేటికాలంలో ఎస్వీ రంగారవు అంతటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి గొప్ప నటుడు ప్రకాశ్‌రాజ్. ఏ పాత్రలోనైనా జయసుధ ఒదిగిపోతారు.
నరేశ్ మంచి పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టేవాడు మాత్రమే అనే రీతిలో తయారైంది. అలాంటి తరుణంలో ‘దిల్’ రాజు నిర్మాతకి నిర్వచనంగా నిలబడడం గర్వ కారణం. సినిమా విజయం సాధించే వరకూ ఓ తపనతో పనిచేస్తారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ కథను సతీశ్ నాకు చెప్పినప్పుడు, అందరి జీవితాలు కనిపించాయి. ‘బొమ్మరిల్లు’తో తెలుగులో ఏవిధంగా కుటుంబ కథా చిత్రాలు ప్రారంభమ య్యాయో, అలాగే ఈ ‘శతమానం భవతి’తో మళ్లీ ఫ్యామిలీ చిత్రాల ఒరవడి ప్రారంభమవ్వాలనే నా ఆకాంక్ష ఈరోజు నెరవేరినందుకు ఆనందంగా ఉంది. వినాయక్ ‘ఆది’తో డిస్ట్రిబ్యూటర్‌గా, ‘దిల్’తో నిర్మాతగా మారా. ‘దిల్’ సినిమా పేరుని నా ఇంటిపేరుగా మార్చారాయన. ‘శతమానం భవతి’ బాగుందం టూ చిరంజీవిగారు స్వయంగా ఫోన్ చేసి అభినం దించడం మరచిపోలేను’’ అన్నారు.
‘‘తణుకు నరేంద్ర థియేటర్‌లో చిరంజీవిగారి ‘ఖైదీ’ చిత్రం ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. ఇప్పుడు ఆయన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం పక్కన మా చిత్రం రిలీజ్ కావడం.. మమ్మల్ని అభినందించేందుకు చిరంజీవిగారు రావడం జీవితంలో మరచిపోలేని రోజు’’అన్నారు సతీశ్ వేగేశ్న. శర్వానంద్ మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌లో ఇప్పటివరకూ ఇది చేయొద్దు? అనకుండా నా ఇష్టాన్ని ప్రోత్సహించింది నా తల్లితండ్రులే. చిరంజీవి అంకుల్ ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ మరచిపోలేను. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ఆయనే అవకాశం ఇప్పించారు. ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పేందుకు వెళితే ‘నా గొప్పతనం ఏముంది. నీ సంకల్పం గొప్పదైతే దేవుడు తలరాతను తిరగరాస్తాడు’’ అని చెప్పారు. ఈ వేడుకలో పలువురు పాల్గొన్నారు.