
నివాళులర్పిస్తున్న చిరంజీవి
బన్సీలాల్‌పేట్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ మహ్మద్(55) ఆదివారం గుండెపొటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి మహ్మద్ ముషీరాబాద్ స్పెన్సర్ ఎదురుగా ఉన్న ఓ దర్గాలో నిద్రించాడు. తెల్లవారుజామున దర్గా నిర్వాహకులు అతడిని లేపేందుకు ప్రయత్నించగా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు మహ్మద్ మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. గుండెపోటు రావడంతో నూర్ మహ్మద్ నిద్రలోనే కన్నుమూసినట్లు సమాచారం. మోండా మార్కెట్‌లో తమల పాకుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న నూర్ మహ్మద్ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి కుటుంబసభ్యుల చిత్రాల విడుదల సందర్భంగా సినిమా థియేటర్ల వద్ద హడావిడి చేసేవాడు. చిరంజీవి కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నూర్ మహ్మద్ మరణవార్త తెలియగానే చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో న్యూబోయిగూడలోని ఆయన ఇంటికి తరలి వచ్చారు.
చిరంజీవి, అల్లు అరవింద్,అల్లు అర్జున్ పరామర్శ....
నూర్ మహ్మద్ మరణవార్త తెలియగానే చిరంజీవి, అల్లు అర్జున్, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆయన ఇంటికి వచ్చి నూర్ మహ్మద్ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. చిరంజీవి, అల్లు అర్జున్‌ను చూడగానే నూర్ మహ్మద్ భార్య పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. చిరంజీవి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నూర్ మహ్మద్ అంత్యక్రియలకు చిరంజీవి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని ముస్లిం శ్మశాన వాటికలో నూర్ మహ్మద్ అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment