Chitralahali Movie Review, in Telugu | ‘చిత్రలహరి’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

Apr 12 2019 11:59 AM | Updated on Apr 12 2019 9:09 PM

Chitralahari Telugu Movie Review - Sakshi

వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌కు ‘చిత్రలహరి’తో హిట్టొచ్చిందా..?

టైటిల్ : చిత్రలహరి
జానర్ : ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : కిషోర్‌ తిరుమల
నిర్మాత : రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి

మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్‌ తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న  ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తాజాగా చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని తన పేరును కూడా సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన చిత్రలహరి సాయి ధరమ్‌కు హిట్ ఇచ్చిందా..? పేరు మార్చుకోవటం కలిసొచ్చిందా..?

కథ‌ :
విజయ్‌ కృష్ణ (సాయి ధరమ్‌ తేజ్‌) జీవితంలో సక్సెస్‌ అంటే తెలియని కుర్రాడు. ఈ పోటీ ప్రపంచంలో తాను గెలవలేకపోతున్నా అని విజయ్‌ నిరుత్సాహపడినా.. తండ్రి (పోసాని కృష్ణమురళి) మాత్రం తన కొడుకు ఎప్పటికైన సక్సెస్‌ అవుతాడన్న నమ్మకంతో ఉంటాడు. యాక్సిడెంట్‌లో సరైన సమయానికి సహాయం అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు విజయ్‌ ఓ డివైజ్‌ను తయారు చేస్తాడు. దాని స్పాన్సర్‌షిప్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే లహరి(కల్యాణీ ప్రియదర్శన్‌) పరిచయం అవుతుంది. తన అలవాట్లు, ఉద్యోగం గురించి అబద్దాలు చెప్పి లహరిని ప్రేమిస్తాడు విజయ్‌. కానీ ఓ రోజు లహరికి నిజం తెలిసిపోతుంది. విజయ్‌ని వదిలేసి దూరంగా వెళ్లిపోతుంది. తనకు ప్రేమలోనూ సక్సెస్‌ దక్కలేదని మరింత కుంగిపోతాడు విజయ్‌. అలాంటి విజయ్‌ తిరిగి ఎలా సక్సెస్‌ సాధించాడు..?ఈ కథలో స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌) పాత్ర ఏంటి? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సారి తాను గతంలో చేయని ఓ కొత్త తరహా పాత్రను ఎంచుకున్నాడు. నేటి యూత్‌ ను ప్రతిబింభించే చేసే క్యారెక్టర్‌లో తనవంతుగా బాగానే నటించాడు. తన రేంజ్‌లో ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌, డాన్స్‌లు చేసే సాయికి చాన్స్‌ దక్కలేదు. కానీ మెచ్యుర్డ్‌ పర్ఫామెన్స్‌తో విజయ్‌ కృష్ణ పాత్రలో జీవించాడు. హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శన్‌ పరవాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించినా తరువాత ఓకె అనిపించేలా ఉంది. మరో హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్‌కు పెద్దగా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కలేదు. కార్పోరేట్ ఉమెన్‌గా నివేదా లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :
సెన్సిబుల్‌ పాయింట్స్‌తో సినిమాలను తెరకెక్కించే కిషోర్‌ తిరుమల చిత్రలహరి కోసం మరో ఇంట్రస్టింగ్ లైన్‌ తీసుకున్నాడు. నేటి యూత్ సక్సెస్‌ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు. సక్సెస్‌ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు అన్న విషయాలను తెరమీద చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో కిషోర్‌ పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌ కథా కథనాలు నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్‌ లేకపోవటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది.

కిషోర్‌ తిరుమల దర్శకుడిగా తడబడినా రచయితగా మాత్రం సక్సెస్‌ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ గుర్తిండి పోయేలా ఉన్నాయి. ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా ఈ సినిమాతో పరవాలేదనిపించాడు. రెండు పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ బోర్‌ కొట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
సాయి ధరమ్‌ తేజ్‌
కొన్ని డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
స్లో నేరేషన్
క్యారెక్టరైజేషన్స్‌

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement