
ప్రముఖ నృత్యదర్శకుడు రాజుసుందరం మరోసారి మెగాఫోన్ పట్టాడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. పలు భాషా చిత్రాలకు నృత్యదర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్న రాజుసుందరం కొన్ని చిత్రాల్లోనూ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు ఈయన దర్శకుడిగా అవతారమెత్తి అజిత్ హీరోగా ఏగన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో రాజు సుందరం ఆ తరువాత దర్శకత్వం జోలికి పోలేదు. అలాంటిది మరోసారి మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఇందులో నటుడు శర్వానంద్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో మంచి పేరున్న నటుడు ఈయన, కాగా కోలీవుడ్‌లోనూ మూడు నాలుగు చిత్రాల్లో నటించారు.
అందులో జయ్‌తో కలిసి నటించిన ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా చేరన్ దర్శకత్వంలో నటించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్ ల్కై చిత్రం నిర్మాణం పూర్తి చేసుకున్నా తెరపైకి రాలేదు. ఆ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయాల్సి వచ్చింది. కాగా చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని శర్వానంద్ పరిక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అదేవిధంగా నృత్యదర్శకుడు రాజుసుందరానికి దర్శకుడిగా ఈ చిత్రం కీలకం అవుతుంది. కాగా ఈ చిత్రం మేలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడలేదదన్నది గమనార్హం. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment