
జూబ్లీహిల్స్: ఈ కరోనా కఠిన సమయంలో ప్రాంతాల వారిగా కళాకారులను విడదీసి వారిని అవమానించేలా మాట్లాడటం సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు సరికాదని తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఫెడరేషన్ యూనియన్ నేతలు అన్నారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఫెడరేషన్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి, కోశాధికారి వజనేపల్లి ఠాగూర్ తమ్మారెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీసీసీ తరపున సినీ కళాకారులకు, సినీ కార్మికులకు సహాయం చేస్తున్న తరుణంలో తెలంగాణ సినిమా యూనియన్ వారికి సరిగ్గా అందడం లేదని ఒక ఇంటర్వ్యూలో ఆయనను ప్రశ్నించగా తమ్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ యూనియన్లను ఎవరు పెట్టమన్నారని, రాష్ట్రం వచ్చినంత మాత్రాన యూనియన్లు పెట్టుకుంటారా అని అవమానకరంగా మాట్లాడారన్నారు. ఆయన వెంటనే తెలంగాణ సినీ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.