సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే నాలుగు... సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి. ఉగాది, క్రిస్మస్‌లకు కూడా సినిమాలు వస్తుంటాయి. అయితే వసూళ్లకు మొదటి నాలుగు పండగలే ప్రధానం. 2020లో సంక్రాంతి సందడి బాగానే సాగింది. అయితే కరోనా దెబ్బకు సమ్మర్ సంబరం మిస్సయింది. దసరా, దీపావళికి కూడా సినిమా పండగ లేదు. సంవత్సరాంతంలో మెల్లిగా సినిమాల విడుదల ఆరంభమైంది. 2021లో సంక్రాంతి సందర్భంగా వెండితెరకు బోలెడన్ని బొమ్మలు వచ్చాయి. కానీ ఈసారి కూడా సమ్మర్ సంబరం పోయే పోచ్! కరోనా సెకండ్ వేవ్‌తో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. గత సమ్మర్‌కి మార్చి చివర్లో థియేటర్లకు లాక్‌పడింది.. ఈ సమ్మర్ కూడా సందడి మిస్.
వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు, తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. అందుకే సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా ఈసారీ నిరాశే. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 9 వరకు థియేటర్స్ వంద శాతం సీటింగ్‌తో నడిచాయి.
ఈ సమయంలో ‘వైల్డ్ డాగ్, వకీల్‌సాబ్, రంగ్ దే, జాతిరత్నాలు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు షెడ్యూల్ అయిన సినిమాల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్ 16), నాని ‘టక్ జగదీష్’ (ఏప్రిల్ 23), కంగనా రనౌత్ ‘తలైవి’ (ఏప్రిల్ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. అలాగే మే నెలలో విడుదలకు షెడ్యూల్ అయిన పెద్ద చిత్రాల్లో చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) కూడా వాయిదా పడింది. ఇవే కాదు.. వెంకటేశ్ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇలా ఈ సమ్మర్ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది.
వెండితెర వెలవెల
చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది వేసవికి సినిమా పండగ లేకుండాపోయింది. 2020 మార్చి 13న విడుదలైన సినిమాలు ఓ మూడు నాలుగు రోజులు థియేటర్లలో ఉండి ఉంటాయేమో! ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల సినిమా థియేటర్లకు లాక్ పడింది. 13న ఓ పది చిన్న సినిమాల వరకూ విడుదలయ్యాయి. వాటిలో ‘బగ్గిడి గోపాల్, మద, అర్జున’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల విడుదలకు బ్రేక్ పడటంతో సమ్మర్ సంబరం మిస్సయింది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’, 9న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయ్యాయి. ఆ తర్వాత విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వేసవి కూడా వెండితెర వెలవెలపోవడం సినీప్రియులకు బాధాకరం. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి.. సినిమాని నమ్ముకున్న అందరికీ బాధాకరమే.
ఓటీటీలో సినీ హవా
తీసిన సినిమా హార్డ్ డిస్క్‌లోనే ఉండిపోతే నిర్మాతల హార్ట్ హెవీ అయిపోతుంది. పెరిగే వడ్డీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో కొందరు చిన్న నిర్మాతలకు ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్ ఓ ఊరట అయింది. గతేడాది లాక్‌డౌన్‌లో నేరుగా ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామం’. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి చిన్న, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యాయి. వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలులొచ్చాయి. ఇలా ఆ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకూ ఓటీటీలో విడుదలై, ఇంటికే వచ్చిన సినిమాలెన్నో. పరిస్థితులు చూస్తుంటే ఇకముందు కూడా ఓటీటీ హవా కొనసాగేలా ఉంది.
స్మాల్.. మీడియమ్‌లు కూడా...
వేసవిలో పెద్ద సినిమాలే కాదు..పెద్ద సినిమాల మధ్యలో చిన్న, మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఆ సినిమాలు కూడా ఈసారి వాయిదా పడ్డాయి. అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, తేజా సజ్జా ‘ఇష్క్’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ వంటి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైన అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్’ అనూహ్యంగా ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
సోలోగా.. ధైర్యంగా...
గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్‌డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment