ఊ అంటావా కరోనా.. ఊహూ అంటావా కరోనా...
రమ్మంటావా కరోనా.. రావొద్దంటావా కరోనా.. రెండేళ్లుగా సినిమాల విడుదల విషయంలో కరోనా ఇలానే దోబూచులాడుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, తెరపై ప్రత్యక్షమవడమే ఆలస్యం అనుకునే టైమ్‌లో కరోనా విజృంభించి ‘ఊహూ’ అంటోంది... ‘రావద్దంటోంది’. కరోనా ఎఫెక్ట్‌తో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రావాల్సిన సినిమాలు ఏప్రిల్‌కి వాయిదా పడ్డాయి.
అయితే ఆరేడు సినిమాల వరకూ పెద్దవే కావడంతో డేట్ల సర్దుబాబు, థియేటర్ల సర్దుబాటు... ఇలా ఎన్నో సర్దుబాట్లు అవసరం. మరి.. అన్ని సర్దుబాట్లూ చేసుకుని తీరా రిలీజ్ టైమ్‌కి కరోనా ‘ఊ’ అంటుందా... ‘రావొద్దు’ అంటుందా అనేది సమ్మర్‌లో తెలుస్తుంది. ఇక సమ్మర్‌లో మెయిన్ సీజన్ అయిన ఏప్రిల్‌లో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.
ఏప్రిల్ ఎండలు పుంజుకునే టైమ్‌కి నెల తొలి రోజే రావడానికి రెడీ అవుతున్నాడు ‘ఆచార్య’. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్‌కు ప్రకటించక ముందే ఇదే తేదీని ముందుగా బుక్ చేసుకుంది ‘సర్కారువారి పాట’ చిత్రం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల మహేశ్ కాలికి సర్జరీ జరగడం, ఆ తర్వాత కరోనా బారిన పడటం, అలాగే ఈ చిత్రానికి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు కూడా కోవిడ్ బారిన పడటంతో ‘సర్కారువారి పాట’ చిత్రం విడుదల ఆగస్టుకు వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి.
కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1నే విడుదల చేసే సాధ్యాసాధ్యాలను ఈ చిత్రం యూనిట్ పరిశీలిస్తోందని తెలిసింది. మరి.. ఏప్రిల్ 1నే ‘ఆచార్య’, ‘సర్కారువారి పాట’ విడుదలవుతాయా? ఏదైనా చిత్రం వాయిదా పడుతుందా? మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు ‘కేజీఎఫ్ 2’ ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ వస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక ఇదే నిర్మాత నిర్మిస్తోన్న మరో భారీ చిత్రం ‘సలార్’ కూడా ఏప్రిల్ 14 విడుదల జాబితాలో ఉంది. ఈ తేదీని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది.
అయితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘సలార్’ చిత్రాలకు ఒకే నిర్మాత, ఒకే దర్శకుడు కాబట్టి, పైగా ‘కేజీఎఫ్ 2’తో పోల్చితే ‘సలార్’ షూటింగ్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. ‘సలార్’ దసరాకు విడుదలయ్యే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఏప్రిల్ 14నే నాగచైతన్య తెరపై కనిపించనున్నారు. కానీ నాగచైతన్య హీరోగా చేసిన చిత్రంతో కాదు. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న హిందీతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది.
ఇంకోవైపు సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా çపడిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎఫ్ 3’. వెంకీ–వరుణ్–అనిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న థియేటర్స్‌కు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా ఇదే తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఎమ్‌ఎస్ రాజశేఖర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్. ఇక సమంత నటించిన తొలి మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ కూడా సమ్మర్ లిస్ట్‌లోనే ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమ గుణ తేదీలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇవే కాదు.. మరికొన్ని మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా ఏప్రిల్ రిలీజ్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. మరి.. సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ మంచి సీజన్ కదా.
ఏప్రిల్ వైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూపు?
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై అన్ని ఇండస్ట్రీస్‌లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ని ఏప్రిల్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకుంటే ‘ఎఫ్ 3’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల విడుదల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు.
వేసవిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు కూడా విడుదలవుతుంటాయి. ఈ వేసవికి కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘బీస్ట్’, దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముందుగా విజయ్ ‘బీస్ట్’ ఏప్రిల్ 14న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ‘విక్రమ్’ కూడా ఏప్రిల్‌లోనే రానున్నట్లు తెలిసింది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి పార్ట్ వేసవిలోనే రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment