చిరంజీవి
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు నడుం బిగించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి వారిని ఆదుకునేందుకు సి. సి. సి. మనకోసం (కరోనా క్రై సిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి చైర్మన్ గా చిరంజీవి ఉంటారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ –‘‘ఎలాంటి విపత్తులు వచ్చినా సహాయం చేయడంలో సినిమా పరిశ్రమ ముందుంటుంది. సినీ కార్మికులకి మనం ఏం చేయగలం అని చిరంజీవిగారు తన ఆలోచనతో ముందుకు వచ్చారు.
చిరంజీవిగారి ఆధ్వర్యంలో సురేష్ బాబు, నేను, ఎన్ .శంకర్, సి.కల్యాణ్, దాము కలిసి చిన్న కమిటీగా ఏర్పాటయి ‘సీసీసీ మనకోసం’ సంస్థ ద్వారా చిత్రపరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. దీనికి నాందిగా మొదట చిరంజీవిగారు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. నాగార్జునగారు కోటి రూపాయలు, ఎన్టీఆర్ 25లక్షలు విరాళాలు ప్రకటించారు. ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవచ్చు’’అన్నారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘సి.సి. సి. మనకోసం కమిటీతో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్, గీతా ఆర్ట్స్ బాబు, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, కొమరం వెంకటేష్, ఫెడరేషన్ కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌గారి ఆశీస్సులు, మంత్రి కేటీఆర్‌గారి అండదండలు కావాలని కోరుతున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment