ఒక్క సినిమాకు డెరైక్షన్ చేస్తా! | cinematography jayaram interview | Sakshi
Sakshi News home page

ఒక్క సినిమాకు డెరైక్షన్ చేస్తా!

Published Sun, Dec 7 2014 11:00 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఒక్క సినిమాకు డెరైక్షన్ చేస్తా! - Sakshi

ఒక్క సినిమాకు డెరైక్షన్ చేస్తా!

తెలుగు చిత్రసీమలోని ప్రతిభావంతులైన ఛాయాగ్రాహ కుల్లో జయరామ్ తప్పకుండా ముందు వరుసలో ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 110 చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారాయన. ఐవీ శశి, కె.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి, రవిరాజా... ఇలా మేటి దర్శకులతో పనిచేసిన అనుభవం జయరామ్‌ది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఇప్పటికీ ధాటిగా దూసుకుపోతున్న జయరామ్ చదివింది ఎంతో తెలుసా? 5వ తరగతి. అవసరం తనకు అన్నీ నేర్పింది అంటారాయన. ఇంకా తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం...
 
 ఏంటండీ... బిజీగా ఉన్నట్టున్నారు?
 అవునండీ.. ‘రైటర్’, ‘తొండి’ అనే రెండు సినిమాలు చేస్తున్నాను.  ‘రైటర్’ సినిమానైతే... 80 శాతం ఫిలిమ్‌లో తీశాం. నెగిటివ్‌లో తీసిన చివరి సినిమా అదే అవుతుంది. ఈ సినిమాకు కాస్త గ్రాఫిక్ వర్క్ చేయాల్సి ఉంది. అందుకే 20 శాతం డిజిటల్‌లో తీయాల్సి వచ్చింది. ‘తొండి’ సినిమానైతే పూర్తిగా డిజిటల్‌లో తీశాను.
 
 సినీరంగంలో ఎన్నో విభాగాలుండగా ఛాయాగ్రహణాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
 మొదట్నుంచీ నాకు సినిమాలన్నా, ఫొటోగ్రఫీ అన్నా ఇష్టం. వరంగల్‌లో ఉన్నప్పుడు నాకో ఫోటో స్టూడియో ఉండేది. సినిమాకెళ్లి... సన్నివేశానికి అనుగుణంగా షాట్ ఎలా పెట్టారో, లైటింగ్ ఎలా వేశారో గమనించేవాణ్ణి. సినిమాలో కెమెరా వర్క్ నచ్చితే పదేపదే  చూసేవాణ్ణి. 1966లో రామినీడుగారు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేరాను. ఆయన ప్రోత్సాహంతోనే ఛాయాగ్రహణం వైపు వెళ్లాను.
 
 కెమెరా ఎవరెవరి వద్ద నేర్చుకున్నారు?
 నేను విన్సెంట్‌గారి వీరాభిమానిని. నా అదృష్టం బావుండి నేను తొలుత చేరింది కూడా ఆయన దగ్గరే. విన్సెంట్‌గారితో చాలా సినిమాలకు పనిచేశాను. వాటిలో ‘అన్నమయ్య’ ఒకటి. కంప్యూటర్ యుగంలో కూడా  ఏ మాత్రం టెక్నాలజీని ఉపయోగించకుండా కేవలం ట్రిక్ షాట్స్‌తో ఆ చిత్రం తీసిన ఘనుడు విన్సెంట్‌గారు. ఆ తర్వాత కేఎస్ ప్రకాశ్‌గారు, ముంబయ్ కెమెరామేన్ ఇషాన్ ఆర్య... ఇలా చాలామంది దగ్గర పనిచేశా.
 
 కెమెరామేన్‌గా మీ ప్రస్థానం?
 చిరంజీవితో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ‘చిరంజీవి’(1984) కెమెరామేన్‌గా నా తొలి చిత్రం. అన్ని కెమేరాలతోనూ పని చేశాను. ప్రస్తుతం డిజిటల్‌లోనే ఎక్కువ చేస్తున్నాం. డిజిటల్‌లో వర్క్ తగ్గుతుందని అంటుంటారు కానీ... నిజానికి ఫిల్మ్‌కంటే డిజిటల్‌కే వర్క్ ఎక్కువ.
 
 అదేంటి?
 5డి కెమెరా అనగానే... ఆర్టిస్టుల్ని మౌల్డ్ చేయడం గురించి పట్టించుకోవడం లేదు. లైట్ ఉందనగానే తీసేస్తున్నారు. దాని వల్ల బొమ్మ తెలుస్తుంది అంతే. క్రియేషన్ ఆఫ్ లైటింగ్ ఉండదు. ఆర్టిస్టుల మౌల్డింగ్‌ని చూసుకొని లైటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, దాని కోసం తగినంత శ్రమ చేస్తేనే రిజల్ట్. క్వాలిటీ ఆఫ్ ఫొటోగ్రఫీకి కొన్ని పద్ధతులుంటాయి. ఆర్టిస్టుల ముఖానికి తగ్గట్టు లైటింగ్ ఉండాలి. దీంట్లో కూడా గ్లామరస్ లైటింగ్, ఆర్టిస్టిక్ లైటింగ్.. ఇలా చాలా రకాలుంటాయి. కెమెరామేన్ ప్రతిభ కనిపించేది అక్కడే.
 
 ఈ మధ్య కొందరు కెమెరాతోనే పనిలేదు... అంటున్నారు కదా?
 సినిమా అంటేనే ఆడంబరం. ప్రేక్షకులు కాసేపు ఎంజాయ్ చేయడానికి సినిమాకొస్తారు. ఈ సెట్టింగులు, ఈ టెక్నాలజీ, ఈ హంగామా లేకపోతే ఎలా? లైట్ లేకుండా, క్లారిటీ లేకుండా, బొమ్మ కనిపించకుండా సినిమా ఉంటే జనాలు ఎంజాయ్ చేయగలరా? ఇది వరకు ఫిల్మ్‌లో ఓవర్ ఎక్స్‌పోజ్, అండర్ ఎక్స్‌పోజ్, కరెక్ట్ ఎక్స్‌పోజ్ ఇలా మూడు రకాలుండేవి. కరక్ట్ ఎక్స్‌పోజ్ ఇస్తే ఏ రంగు ఆ రంగులా కనిపించేది. ఓవర్ ఎక్స్‌పోజ్ అయితే... థిక్‌గా కనిపించేది. అండర్ ఎక్స్‌పోజ్ చేస్తే బొమ్మ సరిగ్గా కనిపించేది కాదు. దీని కోసం ఎంతో శ్రమించేవాళ్లం. ఎందుకీ కష్టమంతా. టెక్నీషియన్స్‌లో ఒక్కొక్కరిలో ఒక్కో టేస్ట్. దేన్నీ కాదనలేం. కానీ, వారి అభిప్రాయాన్ని వేరొకరిపై రుద్దకూడదు. క్వాలిటీ బట్టే సినిమా .
 
 ఒక సీనియర్ కెమెరామేన్‌గా చెప్పండి . సినిమా చేయడానికి ఏ కెమెరా కరెక్ట్?
 ఏ కెమెరా అయినా సినిమాకు పర్‌ఫెక్టే. అయితే.. దానికి వాడే లెన్స్‌ను బట్టి క్లారిటీ ఉంటుంది. నాకు తెలిసి బ్లాక్ లెన్స్ పర్‌ఫెక్ట్. 40 లెన్స్, 50 లెన్స్, 75 లెన్స్ ఇలా మార్చి మార్చి ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్‌కి తగ్గట్టు వాడొచ్చు. ఈ లెన్స్‌ని రెడ్, ఎలెక్స్... లేటెస్ట్ డిజిటల్ కెమెరాలు.. ఇలా అన్నింటికీ వాడొచ్చు. కేలబిరేషన్ చేస్తే సరిపోతుంది.
 
 కెమెరామేన్‌గా మీరు కష్టపడి తీసిన సినిమాలు?
 మలయాళంలో ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ మూవీ ‘1921’ నా కెరీర్‌లో ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన సినిమా. స్వాతంత్య్రోద్యమ సమయంలో జరిగిన యథార్థగాథ అది. దానికి కేరళ అవార్డుతో పాటు ఫిలిం క్రిటిక్స్ అవార్డు కూడా దక్కింది. దీని తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’. ఈ సినిమాను హైదరాబాద్ గండిపేట సమీపంలోని మంచిరేవులలో తీశాం. ఉదయిస్తున్న సూర్యుడి నుంచి బాబాగారు ఎంటరయ్యే సన్నివేశాన్ని ఎంతో శ్రమించి తీశాను. అలాగే... బాబా మూడు రోజుల పాటు తన భౌతిక దేహాన్ని వదిలి వెళ్లిపోయినప్పుడు వచ్చే ‘నువు లేక అనాథలం’ పాటను మూడు రోజులు మూడు డిఫరెంట్ లైటింగ్స్‌తో తీశాను. ఆ సినిమా నాకో అద్భుత జ్ఞాపకం. వీటితో పాటు పెళ్లిసందడి, రాయలసీమ రామన్నచౌదరి చిత్రాలు కూడా కష్టపడి చేసినవే.
 
 దర్శకత్వం చేసే ఉద్దేశం ఉందా?

 భవిష్యత్తులో ఒక్క సినిమాకు డెరైక్షన్ చేస్తా. కథ కూడా రెడీ చేస్తున్నా. నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. చాలామంది గొప్ప దర్శకులతో పనిచేశాను కదా. ఆ అనుభవం కచ్చితంగా ఉపకరిస్తుంది.
 
 మీ ఫ్యామిలీ వివరాలు?
 సినిమాల్లోకి రాకముందు మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న వరంగల్‌లోని ప్రభుత్వ బట్టల మిల్లులో సహాయకునిగా పనిచేసేవారు. ప్రస్తుతం మా తమ్ముడు శ్రీనివాస్ కూడా కెమెరా డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్నాడు. నేను చదివింది 5వ తరగతి. హిందూ పేపర్ చదివి ఇంగ్లిష్, మద్రాసులో వాల్‌పోస్టర్లు చూసి తమిళం నేర్చుకున్నా. మలయాళం సినిమాలు చేస్తున్నప్పుడు మలయాళం, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు కన్నడం నేర్చుకున్నా. బ్రతుకుతెరువే నాకు అన్నీ నేర్పింది. నాకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు.
 
 తెలుగు నేలపై ఉన్న మమకారంతో అన్నం పెట్టిన మద్రాసు వదిలి ఇక్కడికొచ్చాం. కానీ ఇక్కడ తెలుగువాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. పరాయి రాష్ట్రం వారితో పనిచేయించుకుంటున్నారు. నిర్మాతలది ఏమీ చేయలేని పరిస్థితి. దర్శకులు, హీరోల ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతోంది. ఇకనైనా కళ్లు తెరిచి తెలుగువారిని ప్రోత్సహిస్తే... తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం.  
 
 - బుర్రా నరసింహ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement