సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్ రణు మొండాల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రణు ముఖానికి మితిమీరిన మేకప్ చేసినట్లుగా ఉన్న ఫొటోను చూసి నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో పాటలు పాడే వారిని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుందంటూ సంస్కారహీనంగా మాట్లాడుతూ రణు వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. మరికొందరు ఓ అభిమాని సెల్ఫీ అడిగితే ఆమెను నెట్టేసిన రణుకు ఈ మాత్రం మేకప్ ఉండాలిలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే అది నిజమైన ఫొటో కాదని తేలడంతో ప్రస్తుతం నాలుక కరుచుకుంటున్నారు. కోల్‌కతాలోని రైల్వే స్టేషనులో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. రణు గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా ఆమెకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడు. దీంతో రణు పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవానికి నిర్వాహకులు రణును అతిథిగా ఆహ్వానించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె రిచ్ మేకోవర్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో కొంతమంది ఆకతాయిలు.. ఫొటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లేయర్లు లేయర్లుగా మేకప్ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫొటోనే రణు ట్రోల్స్ బారిన పడటానికి కారణమైంది. కాగా రణు గురించిన విమర్శలపై... ఆమెకు మేకప్ చేసిన ఆర్టిస్టు ఇన్‌స్టాగ్రాం వేదికగా స్పందించారు. ‘ ఇది నిజమైన కళకు, ఫేక్ ఫొటోకు మధ్య ఉన్న తేడా. ఎడిట్ చేసిన ఫొటోను చూసి చాలా మంది జోకులు వేసుకున్నారు. మరికొంత మంది బాగా నవ్వుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే మీ చర్యలు, కామెంట్లు ఎదుటి వారి మనోభావాలను గాయపరుస్తాయి కూడా. అందుకే అసలుకు, నకిలీకి తేడా తెలుసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా’ అని రెండు ఫొటోలను షేర్ చేశారు. అయినా సెల్ఫీ అడిగితే దురుసుగా ప్రవర్తించందంటూ రణును నిందించారే తప్ప.. సెలబ్రిటీ లైఫ్‌నకు ఆమె అలవాటు పడలేదన్న విషయాన్ని గుర్తించని వ్యక్తులు.. ఇప్పుడు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తారని ఆశించడం మూర్ఖత్వమే అవుతుందన్న విషయాన్ని తాజా కామెంట్లు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment