
‘నాకు పెళ్లైంది.. పాప కూడా ఉంది’
ముంబై: సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్-10 విజేత మన్ వీర్ గుర్జర్ వైవాహిక స్థితిపై స్పష్టత వచ్చింది. అతడి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అనుమానాలు తలెత్తాయి. వీటన్నింటికీ మన్ వీర్ సమాధానం ఇచ్చాడు. తనకు పెళ్లైందని, ఒక పాప కూడా ఉందని వెల్లడించాడు. తన పెళ్లి గురించి ఎవరి దగ్గర దాయలేదని పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, భావోద్వేగపు బెదిరింపులతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు.
తనకు పెళ్లైన విషయాన్ని బయటపెట్టకపోవడం వెనుక ఎటువంటి అజెండా లేదని అన్నాడు. ‘నాకు పెళ్లైందా, లేదా అనేది బిగ్ బాస్ లో నా ప్రదర్శనకు సంబంధించిన అంశం కాదు. నా వైవాహిక స్థితి గురించి వెల్లడించలేదని ప్రజలు అనుకుంటున్నారు. అది నిజం కాద’ని మన్ వీర్ స్పష్టం చేశాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి బిగ్ బాస్-10లో పాల్గొన్నాడని అతడిపై విమర్శలు వచ్చాయి.
మన్ వీర్ కు పెళ్లైన విషయాన్ని అతడి తండ్రి మహరాజ్ సింగ్ కూడా ధ్రువీకరించాడు. ‘అవును మన్ వీర్ కు పెళ్లైంది. ఇది జరిగి మూడేళ్లు అయింది. అయితే పెళ్లి చేసుకోవడం అతడికి ఇష్టం లేదు. ఏడాదిన్నర తర్వాత మన్ వీర్, అతడి భార్యకు మధ్య సమస్యలు తలెత్తాయి. అవన్నీ భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న గొడవలు. వాటి గురించి మన్ వీర్ మాత్రమే చెప్పగలడు. నా కోడలు, ఏడాదిన్నర మనవరాలు మాతోపాటే ఉంటున్నారు. తన వైవాహిక స్థితి గురించి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా మన్ వీర్ చెప్పాడ’ని మహరాజ్ తెలిపారు. కాగా, మన్ వీర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. అతడు తీసుకున్న ఆహారం విషతుల్యంగా మారడంతో ఆస్పత్రి పాలయ్యాడు.
సామాన్యుడు ‘బిగ్ బాస్’ అయ్యాడు