సినిమా రివ్యూ: కరెంట్ తీగ | Current Teega Movie Review: Comedy, Action masala pack | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: కరెంట్ తీగ

Published Fri, Oct 31 2014 2:52 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

సినిమా రివ్యూ: కరెంట్ తీగ

సినిమా రివ్యూ: కరెంట్ తీగ

 నటీనటులు: 
 మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లీయోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు.
 
 సంగీతం: అచ్చు
 ఫొటోగ్రఫి: సతీష్ ముత్యాల
 నిర్మాత: మంచు విష్ణు
 దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి
 
 ఆకట్టుకునే అంశాలు:
 కామెడీ
 మంచు మనోజ్ ఫెర్ఫార్మెన్స్
 రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లియోన్ గ్లామర్
 ఫైట్స్, ఫోటొగ్రఫి
 క్లైమాక్స్
 
 మైనస్ పాయింట్స్
 రొటిన్ కథ
 
పార్వతీపురంలో గ్రామపెద్ద శివరామరాజు(జగపతిబాబు)కు ముగ్గురు కూతుళ్లు. వారిలో ఒకరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్). ఆ ఊర్లో   వీర్రాజు(సుప్రీత్) అనే వ్యక్తితో శివరామరాజుకు వైరం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన రాజు (మంచు మనోజ్) వీఐపీల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఊర్లో అన్యాయాలను ఎదిరించే రాజు, కవితలు ప్రేమించుకుంటాడు. రాజుతో ప్రేమను ఇష్టపడని కవిత తండ్రి శివరామరాజు.. తనకు నచ్చిన వ్యక్తితో కూతురు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు.
 
దాంతో కవిత, రాజులు లేచిపోవాలని నిర్ణయించుకుని.. ఊర్లో నుంచి పారిపోవడానికి సిద్ధపడుతారు. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకున్న వాళ్లిద్దరూ తిరిగి శివరామరాజు దగ్గరకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చిన రాజు, కవితలను శివరామరాజు ఏంచేశాడు? వీర్రాజుతో శివరామరాజుకు మధ్య ఉన్న వైరం ఏంటి? ఏ కారణంతో రాజుతో కవిత ప్రేమను వ్యతిరేకించాడు? లేచిపోవాలనుకున్న రాజు, కవితలు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇక ఈ కథలో సన్నీ లియోన్, సంపూర్ణేష్ బాబుల పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే ’కరెంట్ తీగ’.
 
 ఎప్పటిలాగే హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దలను వ్యతిరేకించడం లాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే సమాజంలో ఆడపిల్లలు పుట్టడం నేరంగా చూడకూడదు అనే పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని అల్లిన కథలో రాజుగా మంచు మనోజ్.. ఓ మాస్ క్యారెక్టర్‌ను పోషించాడు. మాస్ ఎలిమెంట్స్‌కు తనదైన హాస్యాన్ని, టైమింగ్‌తో మనోజ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్ తో కలిసి రొమాన్స్‌ను పండించాడు. ఓ పాటను పాడటమే కాకుండా, క్యాస్టూమ్స్ డిజైన్, ఫైట్స్ విభాగాల్లో తన మార్కును చూపించాడు.  మరోసారి మనోజ్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. గతంలో కంటే ఈ చిత్రంలో మనోజ్ కాస్త పుష్టిగా కనిపించాడు. ఈ విషయంలో మనోజ్ జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. 
 
 గ్లామర్‌కే పరిమితి కాకుండా.. నటనకు కొంత స్కోప్ ఉండే పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కు లభించింది. తనకు లభించిన అవకాశాన్ని రకుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఫెర్ఫార్మెన్స్ విషయంలో కొంత మెచ్చురిటీ సాధించింది.  అతిధి పాత్రలో సన్నీలియోన్ టీచర్‌గా హాట్‌ హాట్‌గా కనిపించించింది. ఒకే ఒక్క సీన్‌లో కనిపించిన సంపూర్ణేష్ బాబు ఎంట్రీ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహన్ని కలిగించేలా ఉంది.
 
 లెజెండ్‌తో రూట్ మార్చిన జగపతిబాబు.. ఈచిత్రంలో మరో ప్రధానమైన పాత్రను పోషించాడు. గ్రామపెద్దగా, ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఓ బరువైన పాత్రను, కథకు వెన్నెముకగా నిలిచాడు. ఎప్పటిలాగే తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీలు తమ పాత్రల పరిధి మేరుకు పర్వాలేదనించారు. 
 
 సాంకేతిక విభాగం:
 ఈ చిత్రానికి అచ్చు సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన పిల్లా ఓ పిల్లా, వరికుప్పల యాదగిరి ’పోతే పోని పోరా’, భాస్కర భట్ల ’ఎర్ర ఎర్ర చీర’, అనంత శ్రీరాం రాసిన పదహారేళ్లైనా పాటలు ఆలరించాయి. అచ్చు బ్యాక్ గ్రౌడ్ స్కోర్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే అదనంగా మరికొంత ఫీల్ తెరపై కనిపించేంది.  మంచు మనోజ్ కంపోజ్ చేసిన ఫైట్స్, ఫోటోగ్రఫి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. 
 
 దర్శకత్వం: 
 మినిమమ్ గ్యారెంటి అనే బ్రాండ్ ఉన్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి. మనోజ్‌లో ఉండే ఎనర్జీని చక్కగా తెరక్కించాడు. రొటిన్ కథకు కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ను జోడించి మనోజ్‌ను కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. తొలి భాగంలో కథనంలో వేగం మందగించనట్లు కనిపించినా.. సెకండాఫ్‌లో గన్ ఎపిసోడ్, జగపతిబాబు నిద్రలో నడిచే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ పై మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే.. కథలో కొంత వేగం పెరగడానికి అవకాశం ఉంటుంది. 
 
ముగింపు:
కామెడీ, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ‘కరెంట్ తీగ’ బీ, సీ సెంటర్లోని ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మనోజ్ కెరీర్‌లో భారీ విజయం చేరినట్టే. 
--రాజబాబు అనుముల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement