
తమిళసినిమా: దక్షిణాదిలో రాక్‌స్టార్‌గా ముద్రవేసుకున్న సంగీతదర్శకుడు దేవీశ్రీప్రసాద్. ఈయన మెలోడీ బాణీలు శ్రోతల మనసుల్ని ఉల్లాస పరుస్తాయి. ఫాస్ట్ బీట్ సాంగ్స్ యువతను ఉత్సాహపరుస్తాయి. మొత్తం మీద దేవీశ్రీప్రసాద్ సంగీత ఆల్బమ్ సూపర్‌హిట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరో చిత్రాలకు అధిక చిత్రాలను చేసిన సంగీతదర్శకుడిగా దేవీశ్రీప్రసాద్ వాసికెక్కారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో విక్రమ్ హీరోగా నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రానికి దేవీ అందించిన పాటల ఆల్బమ్ సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణను అందుకుంటోంది. ఒక చిత్రంలో అన్ని పాటలు హిట్ అవ్వడం అన్నది అరుదైన విషయమే. అలాంటి అరుదైన విషయం సామి స్క్వేర్ చిత్రానికి రిపీట్ అయ్యిందని మ్యూజిక్ సంస్థల నిర్వాహకులు అంటున్నారు. దర్శకుడు హరి, విక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సామి స్క్వేర్. ఇందులోని అదిరూపనే అనే మెలోడీ పాట, మిలగాపొడి అనే పెప్పీ సాంగ్ విడుదలై విశేష ఆదరణను పొందాయి.
కాగా చిత్ర ఆడియో విడుదల తరువాత డర్నాకా అనే పాట, పుదు మెట్రో రైలు అనే పాటకు సంగీత ప్రియుల నుంచి విపరీతమై రెస్పాన్స్ వస్తోందని చిత్ర వర్గాలు అంటున్నారు. పుదు మెట్రోరైలు పాటను రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ రాయడం విశేషం. ఈయన ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో పాటలను రాసి అవార్డులను కూడా అందుకున్నారు. ఇక తమిళంలోనూ గీత రచయితగా తన ప్రస్తానాన్ని ప్రారంభించారన్నమాట. ఇందులో అమ్మ గురించిన పాటకు చాలా మంచి స్పందన వస్తోందని చిత్ర వర్గాలు తెలిపారు. ఇలా చిత్రంలోని అన్ని పాటలు హిట్ అవ్వడంతో సామి స్క్వేర్ చిత్ర యూనిట్ ఖుషీ అవుతోంది. దేవీశ్రీప్రసాద్ సినిమాలతో బిజీగా ఉన్నా, అమెరికా వంటి విదేశాల్లో సంగీత విభావరిలను నిర్వహిస్తూ అక్కడ తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆనందంలో నింపేస్తుంటారు. అదేవిధంగా మరోసారి అమెరికాలో సంగీత విభావరిని నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 11,18, 25, సెప్టెంబర్ నెల 1,8, 16 తేదీలలో అమెరికాలోని ముఖ్య నగరాల్లో రాక్‌స్టార్ సంగీత విభావరిని నిర్వహించనున్నారు. ఇందులో ఆయన బాణీలు కట్టిన తమిళం, తెలుగు సూపర్‌హిట్ పాటలతో అక్కడి మన వారిని అలరించడానికి రెడీ అవుతున్నారు. అందుకు రిహార్సల్ జరుగుతున్నట్లు దేవీశ్రీప్రసాద్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment