విజయం దేవిదే!
ముక్కోణపు పోటీలో పెద్ద విజయం దేవి చిత్రానిదేనని ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. సుమారు 12 ఏళ్ల తరువాత డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా తమిళంలో కథానాయకుడిగా నటించి తన సొంత బ్యానర్ ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మించిన త్రిభాషా (తమిళం,తెలుగు, హిందీ) చిత్రం దేవి. ఐసీ గణేశ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తమన్నా నాయకిగా ిహ ంది నటుడు సోనూసూద్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం మూడు భాషల్లోనూ విడుదలైంది.ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నై ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ దర్శకత్వం వహిస్తూ నటించడం చాలా కష్టం అన్నారు. ఇతరుల దర్శకత్వంలో నటించడం సులభం అని పేర్కొన్నారు. ఈ దేవి చిత్రాన్ని తొలి రోజు ప్రేక్షకుల మధ్య చిత్రం చూడడానికి కాస్త భయం అని పించిందన్నారు. కారణం వారు తనను హీరోగా ఎలా రిసీవ్ చేసుకంటారన్నదేనని తెలిపారు. అయితే చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, చిత్ర యూనిట్ శ్రమకు దక్కిన మంచి ఫలితం ఇదని పేర్కొన్నారు. చిత్రాన్ని విడుదల చేసిన ఆరా సినిమాస్ అధినేత మహేశ్ మాట్లాడుతూ ఇరుముగన్ చిత్రం తరువాత తమ సంస్థకు దక్కిన అంత మంచి విజయం దేవి చిత్రం అని చెప్పారు.
ఈ చిత్రాన్ని ఈ నెల ఏడో తేదీన రెమో, రెక్క చిత్రాలతో పాటు విడుదల చేశామని అన్నారు. అప్పుడు కొందరు ఆ చిత్రాలకు పోటీగా విడుదల చేస్తున్నారా? అని పరిహాసం ఆడారు. భయపెట్టారని అన్నారు. అయితే వాటికంటే పెద్ద విజయాన్ని దేవి చిత్రం సాధించిందని పేర్కొన్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో ఏక కాలంలో విడుదల కావడంతో తమిళనాడులో మొదట 190 స్క్రీన్‌లోనే విడుదల చేశామని, చిత్రం ఇప్పుడు మంచి విజయం సాధించడంతో అదనంగా మరో 75 స్క్రీన్‌లను పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్, నటుడు ఆర్‌జే.బాలాజి పాల్గొన్నారు.