
బాహుబలి 2 చూసి 3రోజులైనా.. : దేవీశ్రీ ప్రసాద్
హైదరాబాద్ :
బాహుబలి 2 చూసి ఇప్పటికే మూడు రోజులవుతుంది.. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ నుంచి అయితే బయటికి రాగలిగాను గానీ, బాహులి సినిమా నుంచి మాత్రం ఇంకా బయటకు రాలేకపోతున్నానని సంగీత దర్శకుడు దేశ్రీ ప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు.
బాహుబలి2 అనేది కేవలం భారీ వ్యయంతో నిర్మించిన చిత్రం మాత్రమే కాదు, పెద్ద కలలు నెరవేరాలంటే ఎక్కువ కష్టపడాలి. అప్పుడే ఎలాంటి సందేహం లేకుండా లక్ష్యాన్ని సాధిస్తావు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అనేది అసలు మ్యాటరే కాదని దేవీ తెలిపారు. అద్భుతమైన స్టోరీ లైన్ , ఉత్కంఠను పెంచే స్రీన్ ప్లే, ఒళ్లు గగుర్పొడిచే విజువల్స్, దిమ్మతిరిగే నటన అంటూ సినిమా పై ప్రశంసల ఝల్లు కురిపించారు. తాను అనుకున్నట్టుగా సినిమాను అందమైన శిల్పంలా చెక్కిన దర్శకుడు జక్కన్న పర్ఫెక్షన్.. సినిమా చూస్తున్నంతసేపు సీట్ ఎడ్జ్లో కూర్చునేలా చేశాయని తన అనుభూతిని వ్యక్తం చేశారు. వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, లొకేషన్స్, బడ్జెట్ను పక్కన పెడితే బాహుబలి సినిమా తనను మంత్రముగ్ధున్ని చేసిందని పేర్కొన్నారు. ఎన్నిసార్లు అరుస్తూ, క్లాప్స్ కొట్టానో నాకే తెలియదు. కనీసం ఇలాంటి కలను కనాలనే సాహసం కూడా చాలా మంది చేయలేరు, హ్యాట్సాఫ్ రాజమౌళి సర్ అంటూ ఓ నోట్ను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి రాజమౌళి థ్యాంక్స్ అంటూ రీప్లే ఇచ్చారు. ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్లు వసూళ్లు చేసిన తొలి చిత్రంగా బాహుబలి2 రికార్డు సృష్టించింది.