దిలీప్‌కుమార్ సల్వాది
‘నెంబర్‌వన్’ సినిమాతో బాల నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, దాదాపు 30 సినిమాలు చేసిన నటుడు దిలీప్‌కుమార్ సల్వాది. హీరోగా ‘నా సామి రంగ, ఒకే ఒక్క చాన్స్’ వంటి చిత్రాలు చేసిన అతను తాజాగా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే ఒక మంచి చిత్రానికి తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు దొరక్కపోవడం దురదృష్టకరం.
మా చిత్రం ఏపీలో 60 థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ తెలంగాణలో మాత్రం హైదరాబాద్‌లో రెండు, నాగర్ కర్నూల్‌లో ఓ థియేటర్ మాత్రమే దొరికింది. తెలంగాణలో ఒక్క మల్టీప్లెక్స్‌లో కూడా మా చిత్రానికి అవకాశం దొరకలేదు. ‘అవెంజర్స్’ సినిమాకి పోటీగా మీ సినిమాని ఎందుకు విడుదల చేశారు? అని కొందరు అంటున్నారు. అది హాలీవుడ్ సినిమా. ఇక్కడ డబ్ చేశారు. ఓ డబ్బింగ్ సినిమాకి వందల థియేటర్లు దొరికాయి కానీ, మన తెలుగు రాష్ట్రంలో ఓ తెలుగు సినిమాకి మాత్రం కనీసం ఒక్క షోకి అయినా థియేటర్లు దొరక్కపోవడం చాలా బాధగా ఉంది. మా సినిమాకి అమెరికాలో 40ఆటలు, ఆస్ట్రేలియాలో 12 ఆటలు పడ్డాయి. ఏడాది పాటు ఎంతో కష్టపడి ఓ మంచి సినిమా తీశాం. కానీ, దాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లలేకపోతున్నాం.
మా సినిమా బాగుందని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌గారు, జీఎమ్మార్ వాళ్లు చిత్రం చూసేందుకు ఏర్పాట్లు చేయమంటే క్యూబ్ ద్వారా కంటెంట్ పంపించాం. కేటీఆర్‌గారు చూసి ట్వీట్ చేస్తే థియేటర్లు పెరుగుతాయనే నమ్మకం ఉంది. ‘దిక్సూచి’ సినిమాని తమిళ్‌లో డబ్బింగ్ లేదా రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం తెలుగులో నా దర్శకత్వంలో ‘చిత్రసేన’ అనే జూన్‌లో ప్రారంభం అవుతుంది. తమిళంలో హీరోగా నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో సినిమా విడుదలకు రెడీగా ఉంది. తెలుగులో, తమిళంలో నాకు ఇప్పటి వరకూ హీరోగా సరైన హిట్ పడలేదు. అందుకే నన్ను నేను నిరూపించుకోవాలని దర్శకత్వం చేశా. కథ స్వయంగా రాసుకున్న సినిమాలకు మాత్రమే నేను దర్శకత్వం వహిస్తా. వేరే దర్శకుల చిత్రాల్లో హీరోగా చేస్తా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment