ఈసారి చిన్న సినిమా!
‘‘నూతన దర్శకులతో 2008లో మా సంస్థలో సినిమాలు నిర్మించాం. ఆ తర్వాత పెద్ద సినిమాలకే పరిమితమయ్యాం. అందుకే, ఈ ఏడాది ‘కేరింత’ అనే చిన్న సినిమా నిర్మించాలనుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో నూతన నటీనటులతో ‘దిల్’ రాజు ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘సాయికిరణ్ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో అబ్బూరి రవితో కలిసి పూర్తి కథ రెడీ చేశాం. ఈ చిత్రం ద్వారా ముగ్గురబ్బాయిలు, అయిదుగురమ్మాయిలను పరిచయం చేయనున్నాం.
రాష్ర్టంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో ఆడిషన్స్ చేశాం. ఈ 25న హైదరాబాద్‌లో ఆడి షన్స్ జరుపుతాం. వచ్చే నెలాఖరుకి నటీనటుల ఎంపిక పూర్తి చేసి, ఏప్రిల్‌లో షూటింగ్ మొదలుపెడతాం. మా సంస్థలో పని చేసిన విశ్వని కెమెరామేన్‌గా, మధుని ఎడిటర్‌గా, విజయ్‌ని నృత్యదర్శకునిగా పరిచయం చేయనున్నాం’’ అని చెప్పారు. చాలాకాలంగా ఈ కథను వర్కవుట్ చేస్తున్నామని సాయికిరణ్ తెలిపారు. ఈ సమావేశంలో అబ్బూరి రవి, మిక్కీ జే మేయర్ తదితరులు పాల్గొన్నారు.