సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలుస్తారని ఆయన తెలిపారు. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'డాకు మహారాజ్' ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.
సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు కదా.. మరీ మీరు నిర్మించిన డాకు మహారాజ్ పరిస్థితి ఏంటి అని నాగవంశీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కార్యక్రమం నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరిగొచ్చాక సీఎంను కలుస్తాం. ఆ సమయంలో టికెట్ ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలపై చర్చ చేస్తామని ఆయన అన్నారు. నా సినిమా డాకు మహారాజ్ కంటే ముదే దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ విడుదల అవుతుంది. కాబట్టి, టికెట్ల ధరల విషయంలో ఆయన ఏం తేలుస్తారో అందరికీ అదే వర్తిస్తుంది' అని నాగవంశీ అన్నారు. తాము కూడా అన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచమని అడగమన్నారు. ఏ సినిమాకు అయితే టికెట్ ధర పెంపు అవసరమో వాటికి మాత్రమే అడుగుతామని వంశీ అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లతో సినీ ప్రముఖుల భేటీ గురించి తనకు తెలియదని నాగవంశీ తెలిపారు. ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్లిపోతుందని టాక్ వినిపిస్తోంది కదా..? అనే ప్రశ్నకు ఆయన ఇలా అన్నారు. 'నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకున్నా.. అలాంటప్పుడు మరోచోటకు ఎందుకు వెళ్తాను. ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల సపోర్ట్ ఇండస్ట్రీకి వుంది.' అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment