న్యూఢిల్లీ: గోల్‌మాల్ 1, 2, 3..., సింగం.. చెన్నై ఎక్స్‌ప్రెస్.. ఈ సినిమాల పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు రోహిత్ శెట్టి. వరుసగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు సాధిస్తూ దర్శకుడిగా బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రత్యేకించి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత ఈ దర్శకుడికి ఉన్న పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. ఇలా వరుసగా హిట్ చిత్రాలను ఎలా అందించగలుగుతున్నారు? సినిమాలను ఎలా ప్లాన్ చేస్తున్నారు? అని రోహిత్‌ను అడిగితే... ‘హిట్‌లు... ఫ్లాప్‌లు.. మన చేతుల్లో లేవు. అలా వస్తుంటాయంతే. ఓ సినిమాను హిట్ చేయాలని ఎన్నో ప్లాన్‌ను వేసుకొని తెరకెక్కించినా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు.
ప్రేక్షకులు దానిని స్వీకరించడాన్నిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే హిట్‌లు సాధిస్తున్నానని, వందకోట్ల సినిమాల దర్శకుడినంటూ వినిపిస్తున్న ప్రశంసలతో పొంగిపోను. ఇదంతా నేను చేసిందేనని ఎప్పుడూ అనుకోను. ప్రేక్షకులు ఆదరించడం వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాకు వందశాతం కష్టపడడం మాత్రమే నాకు తెలిసింది. అదే నేను చేస్తుంటా. ప్రస్తుతం సింగం-2 ప్రాజెక్టులో బిజీగా ఉన్నాను. స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పని కొనసాగుతోంది. ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశించడం కూడా సరికాదు. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అని రోహిత్ శెట్టి తెలిపారు.