‘కలకాలం మీరు ఇలాగే ఉండాలి.. అమ్మానాన్నా’ | Esha Shares Adorable Pics Of Hema Malini Dharmendra Wedding Anniversary | Sakshi
Sakshi News home page

‘కలకాలం మీరు ఇలాగే ఉండాలి.. అమ్మానాన్నా’

Published Sat, May 2 2020 6:05 PM | Last Updated on Sat, May 2 2020 6:10 PM

Esha Shares Adorable Pics Of Hema Malini Dharmendra Wedding Anniversary - Sakshi

‘‘అమ్మా, నాన్నా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరిలాగే కలకాలం కలిసి ఉండాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం మీకు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను! ప్రేమతో ఇషా, భరత్‌, రాధ్యా, మియూ’’అంటూ అలనాటి బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని, నటుడు ధర్మేంద్రకు వారి తనయ, నటి ఇషా డియోల్‌ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇషా సోదరి అహానా సైతం హేమ, ధర్మేంద్రలకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా వారికి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్పందించిన హేమ మాలిని తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది హీరోలు ప్రయత్నించి విఫలమయ్యారు. సంజీవ్‌ కుమార్‌, జితేంద్ర ఆ జాబితాలో ప్రముఖులు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్‌)

ఇక జితేంద్ర హేమ మాలిని ఇంట్లో వాళ్లను ఒప్పించి.. తన ప్రేమను పెళ్లి పీటలదాకా తీసుకువచ్చాడు. మద్రాసులో వివాహం చేసుకోవడానికి తేదీ ఖరారు చేయించాడు. కానీ అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్‌ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్‌ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. ఆ పెళ్లిని అడ్డుకుని ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో రెండో భార్యగా హేమమాలిని అడుగుపెట్టారు. ఇద్దరూ వైవాహిక బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా ఎన్నడూ ఒకరినొకరు విమర్శించుకోలేదు. అంతేకాదు ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని హేమ మాలిని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన తనకోసమే పుట్టారని భావిస్తానని.. ఆయనతో జీవితం పంచుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక హేమమాలిని ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.(లాక్‌డౌన్‌తో గెలుద్దాం: హేమ పిలుపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement