లాక్‌డౌన్ వల్ల ఇంట్లో జరుగుతున్న ఈ చిన్న విషయాన్నైనా అభిమానులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. అందులో భాగంగా ఇంటి పనులు చేస్తూ, వంట చేస్తూ, షూటింగ్స్ లేవు కదా అని బద్దకించకుండా వర్కవుట్స్ చేస్తూ వీటన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయిత ప్రస్తుత విపత్కర పరిస్థితిలో వర్కవుట్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ మండిపడింది. జనాలకు ఉపయోగపడే వీడియోలను చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ.. "ముందుగా అందరినీ క్షమాపణ కోరుతున్నా. వ్యాయామం చేయడం అవసరమే. నేను ప్రతిరోజు బాల్కనీలో ఒక గంట నడుస్తాను. కానీ ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఇది ప్రపంచం జరుపుకుంటున్న పార్టీ కాదు, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.
మీరు చేయాల్సిన మంచిపనులు ఎన్నో ఉన్నాయి. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. సెలబ్రిటీలు పెద్ద మనసుతో ఎన్నో సహాయ సహకారాలు చేసినప్పటికీ ఇలాంటి చిన్నపొరపాట్లే చేటుని తెస్తాయి. ఇదొక్కటే కాదు. సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారిని గుర్తించి ఆదుకోండి. నా పన్నెండేళ్ల కూతురు మూగజీవాలకు తిండి పెట్టేందుకు దారులు వెతుకుతోంది. నా కొడుకు అందరికీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా పాటలు రాసేందుకు పూనుకున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మీ పాపులారిటీని పక్కనపెట్టి కదలండి. మీరు తల్చుకుంటే ఏదైనా చేయగలరు, కానీ అందుకు ఇంకా సిద్ధపడట్లేదు" అని విమర్శించింది. కాగా బాలీవుడ్ హీరోహీరోయిన్లు కత్రినా కైఫ్, అర్జున్ కపూర్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, సారా అలీఖాన్, మలైకా అరోరా, రకుల్ ప్రీత్‌సింగ్, శిల్పా శెట్టి పలువురు వర్కవుట్ వీడియోలు షేర్ చేసిన లిస్టులో ఉన్నారు. అయితే ఆమె నేరుగా ఏ ఒక్కరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. (వైరసవత్తరమైన సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment