
తమిళ సినిమా (చెన్నై): తమిళ నిర్మాతల మండ లి సర్వసభ్య సమావేశంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మండలి అధ్యక్షు డు విశాల్‌కు వ్యతిరేకంగా పెద్ద పోరే జరగడం తో సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విశాల్ వర్గం గెలుపొంది నిర్వహణ బాధ్యతల ను చేపట్టింది. ఆదివారం తొలి సర్వసభ్య సమావేశం చెన్నైలోని కలైవానర్ అరంగంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. మొదలైన కొద్ది సేపటికే విశాల్‌కు వ్యతిరేకంగా నటుడు, దర్శకుడు చేరన్ వర్గం నినాదాలు చేసింది.
అందులో కొందరు విశాల్ మాట్లాడు తున్న మైక్‌ను లాగేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. వాగ్వాదాలు, తోపులాటలతో సమావేశం పోరు వాతావరణాన్ని తలపించింది. అనంతరం చేరన్ వర్గం మీడియాతో మాట్లాడుతూ విశాల్ ఏడు కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని, ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని, అప్పుడు తాను తగిన బదులిస్తాని విశాల్ సవాల్ విసిరారు.