
మనకు దేవుళ్లకు కొదవ లేదు. అందరి గుళ్లకీ వెళతాం.. మొక్కుతాం.. పూజిస్తాం. కానీ పరాశక్తి ఆలయంలో మాత్రం మన మైండ్‌సెట్ వేరేలా ఉంటుంది. ఏదో తెలీని బరువు, భయం గుండెల్లో దోబూచులాడుతూ ఉంటాయి. కొందరైతే... అమ్మవారి వంక ధైర్యంగా కూడా చూడలేరు. మనిషిలోని మానసిక దౌర్బల్యానికి ఇదొక నిదర్శనం. నిజానికి అమ్మ సంహరించేది మనలోని అరిషడ్వర్గాలను. అది తెలీకపోవడం వల్లే ఆ భయం. రక్తబీజుడనే రాక్షసుణ్ణి సంహరిస్తున్న సమయంలో.. శాంతింపజేయడానికి యత్నించిన సాక్షాత్ శివుణ్ణే కాలికింద పడేసి తొక్కేసిందట అమ్మ. అమ్మవారంటే భయపడటానికి ఈ కథలు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు.

దేవీభాగవతంలోని అమ్మవారి కథల్ని ఒక్కసారి చదివితే... కావల్సినంత కమర్షియల్ వేల్యూస్ కనిపిస్తాయి. ఒకప్పుడు మన సినిమా వాళ్లు ఆ కథల్ని బాగానే ఉపయోగించుకున్నారు. అమ్మ మహిమల్ని ప్రస్తుతిస్తూ, నయనమనోహరంగా చూపించిన సినిమాలు మనకు కోకొల్లలు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సావిత్రి, ఎస్.వరలక్ష్మి, జయలలిత, కాంచన, గిరిజ, దేవిక, బి.సరోజాదేవి, వాణిశ్రీ... ఇత్యాది నటీమణులందరూ అమ్మవారి పాత్రలు పోషించినవారే. అయితే... కేఆర్ విజయ ఎప్పుడైతే... అమ్మవారి పాత్ర పోషించారో... అప్పట్నుంచి ‘అమ్మవారి సినిమా’ అనే ఓ బ్రాండ్ సినిమాల్లో మొదలైంది. దానికి నాంది పలికిన సినిమా ‘మా ఇలవేల్పు’.

కేఆర్ విజయను అమ్మవారిగా తెలుగు ప్రేక్షకులు తొలిసారి చూసింది ‘మా ఇలవేల్పు’ ద్వారానే. బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆ రోజుల్లో పెను సంచలనం. ఈ సినిమా పుణ్యమా అని థియేటర్లన్నీ దుర్గాలయాలుగా మారాయి. కేఆర్ విజయ అయితే... తెరవేల్పుగా అవతరించారు. ఆ తర్వాత వినాయకవిజయం, జగన్మాత, శ్రీదత్త దర్శనం, అష్టలక్ష్మీ వైభవం... ఇలా.. ఎన్నో చిత్రాల్లో అమ్మవారిగా దర్శనమిచ్చి ప్రేక్షకులను భక్తిపారవశ్యంతో తేలియాడించారు కేఆర్ విజయ. ఇప్పటికీ ‘అమ్మవారు’ అంటే... దక్షిణాది ప్రేక్షకుల మనసుల్లో మెదిలే కమనీయరూపం కేఆర్ విజయదే.

కేఆర్ విజయ తర్వాత నళిని, రాధ, అంబిక, విజయశాంతి లాంటి తారలు అమ్మవారిగా మెరిపించినా... రమ్యకృష్ణ మాత్రం ఆ పాత్రలో ప్రత్యేకమైన గుర్తింపునే తెచ్చుకున్నారు. రమ్యకృష్ణకు అమ్మవారిగా పేరు తెచ్చిన సినిమా ‘శ్రీజొన్నవాడ కామాక్షి కటాక్షం’. విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో వాణిజ్య పరంగా కూడా మంచి విజయం సాధించింది. యక్షిణిని అమ్మవారు సంహరించే సన్నివేశంలో ఆదిశక్తిగా రమ్యకృష్ణ అభినయాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదంటే అతిశయోక్తికాదు. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాల్లో అమ్మవారిగా రమ్య కనిపించినా... ‘అమ్మోరు’ సినిమా మాత్రం ఆమె కెరీర్‌లో చిరస్థాయిగా గుర్తుంచుకోదగ్గది. ఆ సినిమా పతాక సన్నివేశంలో మహాకాళిగా మారే సందర్భంలో రమ్యకృష్ణ ఆహార్యం, అభినయం చూసి ప్రేక్షకులు రోమాంచితులయ్యారు. రమ్యకృష్ణ తర్వాత మీనా, రోజా లాంటి తారలు కూడా ఆదిపరాశక్తిగా దర్శనమిచ్చారు. కానీ నేటి తరం కథానాయికల్లో అమ్మవారి పాత్రలను రక్తికట్టించగలిగేదెవరు? అంటే మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.
ఏదిఏమైనా... విజయదశమి అంటే... విజయానికి చిరునామా. ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయం తథ్యం. అందుకే సినిమా వాళ్లు కూడా దసరా రోజున సినిమాలను విడుదల చేయడానికి కానీ, షూటింగ్‌లు ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అమ్మలగన్న అమ్మ... ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ దుర్గమ్మ కటాక్షం సినిమా పరిశ్రమపై ఉండాలని, మరిన్ని మంచి సినిమాలు తెలుగుతెరపైకి రావాలని కాంక్షిస్తూ... జై దుర్గ.