ప్రేక్షకుల ఆదరణే శ్రీరామరక్ష
‘లౌక్యం’ ఆడియో ఆవిష్కరణలో హీరో గోపీచంద్
ప్రేక్షకుల ఆదరణే నటులకు శ్రీరామరక్ష అని హీరో గోపీచంద్ అన్నారు. భవ్య క్రియేషన్స్ నిర్మించిన లౌక్యం ఆడియో ఆవిష్కరణ లయోలా కళాశాల ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో గోపీచంద్ మాట్లాడుతూ నూతన తెలుగు రాష్ర్టంలో జరుగుతున్న తొలి బహిరంగ ఆవిష్కరణ ఇదని, ఇందుకు సహకరించిన నిర్మాత ఆనంద ప్రసాద్, పంపిణీదారులు, ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు.
భవ్య క్రియేషన్స్ సంస్థ మరిన్ని విజయవంతమైన చిత్రాలు నిర్మించాలన్నారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ గతంలో గోపీచంద్‌తో లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాలు నిర్మించామని, లౌక్యం సినిమా మంచికథతో ప్రేక్షకులకు నచ్చేలా సిద్ధం చేశామని చెప్పారు. విజయవాడ ప్రేక్షకుల తీర్పుకోసం ఎదురుచూస్తున్నామన్నారు. సినిమాలోని తొలి పాటను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన చేసిన రాజకీయ ప్రసంగం ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే దారిలో నడిచారు.
ఈ వేడుకలో దర్శకుడు శ్రీవాస్, నటులు చంద్రమోహన్, పృధ్వీరాజ్, హంసానందిని, కోన వెంకట్, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని వినూత్నంగా పల్లకీలో తెప్పించి గోపీచంద్‌తో ఆవిష్కరింపజేశారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ నిర్వహించిన సినీ సంగీత విభావరి, పలు నృత్యాంశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించారుు. యాంకర్లు లాస్య, రవి తమదైన వ్యాఖ్యానంతో అలరించారు.
- విజయవాడ కల్చరల్