
అమ్మాయిలు పైలెట్ కాలేరు. అమ్మాయిలు పైలెట్ అవడం ఏంటి? విహంగయానం చేయాలనుకున్న గుంజన్ సక్సేనాతో ఇరుగుపొరుగు అన్న మాటలివి. ఎవరో ఏదో అన్నారని గుంజన్ వెనక్కి తగ్గలేదు. సరి కదా.. పైలెట్ కావాలనే ఆమె ఆశయం రోజు రోజుకి బలపడింది. సంకల్పం బలమైనదైనప్పుడు ఆశయం నెరవేరుతుంది. గుంజన్ పైలెట్ అయ్యారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తొలి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా చరిత్రలో నిలిచిపోయారు కూడా. ఈ సక్సెస్‌ఫుల్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంజన్ సక్సేనా: కార్గిల్ గాళ్’. గుంజన్ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వంలో కరణ్ జోహార్, అపూర్వా మెహతా, హీరూ జోహార్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.
పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ, వినీత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘ఆకాశమే నీ హద్దు కాకూడదు. దానికి మించిన ఎత్తుకు నువ్వు ఎదగాలి. చాలా గర్వపడుతున్నాను బేటా. అందరు తండ్రులు తమ పిల్లల్ని చూసి గర్వపడేలా చేస్తావని అనుకుంటున్నాను. త్వరలోనే ఈ ప్రపంచం కూడా నీకు చప్పట్లు కొడుతుంది’’ అని ఒక్కో పోస్టర్‌కు ఒక్కో అభినందనను తన ట్వీటర్‌లో రాశారు జాన్వీ తండ్రి బోనీ కపూర్. ‘ధడక్’తో హీరోయిన్‌గా పరిచయమై, నటిగా మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ మలి చిత్రంగా ‘గుంజన్ సక్సేనా’ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 13న విడుదల కానుంది.