
కథే హీరో అంటున్న హన్సిక
నటి హన్సికకు బాణి మార్చుకోక తప్పని పరిస్థితి అట. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ సక్సెస్‌ఫుల్ నటిగానే ముద్రవేయించుకుంది.
నటి హన్సికకు బాణి మార్చుకోక తప్పని పరిస్థితి అట. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ సక్సెస్‌ఫుల్ నటిగానే ముద్రవేయించుకుంది. ఈ మధ్య నటించిన మనిదన్, బోగన్ వంటి చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. పైగా దర్శకుల నటిగానూ పేరు తెచ్చుకుంది. అయినా బోగన్ చిత్రం తరువాత నూతన చిత్రమేదీ చేతిలో లేదు. దీంతో కొత్త ప్రయత్నంగా మాలీవుడ్‌లో ట్రై చేసింది. అక్కడ మోహన్‌లాల్‌కు జంటగా విలన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
తాజాగా కోలీవుడ్‌లో శశికుమార్‌కు జంటగా కొడివీరన్ చిత్రంతో పాటు యువ నటుడు విష్ణువిశాల్‌తో ఒక చిత్రంలో రొమాన్స్ చేయడానికి అంగీకరించింది. దీంతో మరిన్ని సెకెండ్ గ్రేడ్ కథానాయకులతో నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయట. విజయ్, విశాల్, జయంరవి వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు చిన్న హీరోలతో నటించమని అడగడంతో కాస్త షాక్‌కు గురైందట.
అయితే ఆ అవకాశాలను కూడా జారవిడుచుకుంటే మార్కెట్ మరీ డౌన్ అయిపోతుందని, ఆ తరువాత అలాంటి అవకాశాలు కూడా రావని ఆలోచనలో పడ్డ హన్సిక పెద్ద హీరోనా, చిన్న హీరోనా అన్నది సమస్య కాదని, తనకు కథే హీరో అన్న నిర్ణయానికి వచ్చి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించడానికి రెడీ అంటోందట. ఇటీవల నయనతార కూడా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేలా చూసుకుంటూ వర్తమాన హీరోలతో కూడా నటించేస్తోంది.
తాజాగా నటి హన్సిక కూడా అదే బాణీలో పయనించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని కోలీవుడ్‌లో మళ్లీ ఒక రౌండ్ కొట్టాలని ఆశిస్తోందట. మరి ఈ బ్యూటీ నూతన పంథా ఎలాంటి ఫలితాన్ని స్తుందో చూద్దాం. మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తున్న విలన్ చిత్రం పైనా హన్సిక చాలా నమ్మకాన్ని పెట్టుకుందట. ఆ చిత్రం విజయం సాధిస్తే అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో ఉందట.