‘‘ఎక్కడా సమానత్వం లేదు. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు... అన్నిచోట్లా బంధుప్రీతి ఉంది. మీరు ఓ స్టార్ అయితే మీ కొడుకు లేదా కూతురిని సినిమాల్లోకి తీసుకువస్తారు. అది సరైందే. అయితే ఇండస్ట్రీ బయటి వ్యక్తులకు కూడా సమానంగా అవకాశాలు ఇవ్వకపోవడమే సరైంది కాదు. టీవీ నటులు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు సరైన అవకాశం రాకపోవడం వల్లే ఇదంతా. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వొచ్చు కదా’’ అంటూ హిందీ టీవీ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీనా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెండితెరపై ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి అవకాశాలు ఇవ్వాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.(‘సుశాంత్‌ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’)
కాగా బుల్లితెరపై ప్రస్థానం ప్రారంభించి నుంచి బాలీవుడ్ హీరోగా ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం మరోసారి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ వంటి పలువురు సినీ ప్రముఖులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి, ఇండస్ట్రీలో ఎదిగిన తీరు గురించి పంచుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియాతో మాట్లాడిన హీనా ఖాన్.. సుశాంత్ సినీ ప్రయాణం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. కఠిన శ్రమకోర్చి ఉన్నతస్థాయికి ఎదిగాడు. మేం బయటివాళ్లం. మాకు గాడ్‌ఫాదర్లు ఉండరు. కాస్త గుర్తింపు, కొద్దిపాటి గౌరవం మాత్రమే మేం కోరుకుంటాం. కాబట్టి అందరినీ సమానంగా చూస్తే ఇలాంటివి జరగవు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.(ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!)
ఇక ‘యే రిష్తా క్యా కహెలాతా హై’ సీరియల్(తెలుగు డబ్బింగ్- పెళ్లంటే నూరేళ్లపంట)ల్‌లో అక్షరగా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న హీనా.. సినిమాల్లోకి రాకముందే కాన్స్ ఫెస్టివల్‌లో హొయలొలికించే గౌరవం దక్కించుకున్న నటిగా గుర్తింపు పొందారు. ఆ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హీనా ఖాన్.. కాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనే సమయంలో టీవీ యాక్టర్ అవడం వల్ల భారతీయ ఫ్యాషన్ ప్రముఖులు తన పట్ల వివక్ష చూపారని.. అయితే ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు తనకు సాయంగా నిలబడ్డారని పేర్కొన్నారు. కాగా హుస్సేన్‌ఖాన్ దర్శకత్వంలో ‘లైన్స్’ అనే సినిమాతో హీనాఖాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధం కాగా.. ఆ సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. కాగా ఆమె తాజాగా నటించిన ‘అన్‌లాక్’ అనే డిజిటల్ ఫిల్మ్ జీ5లో స్ట్రీమ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment