
'కంగనా చాలా విషయాలు చెప్పింది'
ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన ఈమెయిల్ హ్యాక్ చేసినట్లు ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పష్టం చేసింది. వీరిద్దరి మధ్య నడుస్తున్న కేసు విషయంలో దర్యాప్తు బృందానికి ఇచ్చిన వివరణలో ఆమె ఈ విషయం పేర్కొంది. కంగనా తరుపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ ఆ వివరాలు తెలియజేశారు. ఆయన చెప్పిన ప్రకారం పోలీసుల ముందు వివరణ ఇచ్చేందుకు కంగనా ఆమె సోదరి రంగోలితో కలిసి వెళ్లారు. 'కంగనా, ఆమె సోదరి వివరణ పట్ల పోలీసులు చాలా ఆనందంగా ఉన్నారు.
ఎందుకంటే తాను ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో హృతిక్ పేర్కొనని పలు కొత్త అంశాలు ఇప్పుడు పోలీసులకు తెలిశాయి. అసలు హృతిక్ ఓ వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశాలను ఎందుకు అలా బహిరంగం చేశారనే విషయం గుర్తించకుండానే చాలా విషయాలు ముందుకెళ్లాయి' అని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం 5గంటల నుంచి 8గంటల ప్రాంతంలో పోలీసులు కంగనా వాంగ్మూలాన్ని నమోదుచేసుకున్నట్లు చెప్పారు. అంతకుముందు గత సోమవారం, ఏప్రిల్ 18న ఒకసారి పోలీసులే నేరుగా కంగనా ఇంటి వద్దకు వెళ్లి ఆమె వివరణ తీసుకున్న విషయం తెలిసిందే.