'వివాదం కొనసాగాలని కోరుకున్నా'
ముంబై: రియో ఒలింపిక్స్ కు భారత్ తరపున తనను సుహృద్భావ రాయబారిగా నియమించడంపై చెలరేగిన వివాదం త్వరగా ముగియడం పట్ల బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాదం మరికొంత కాలం సాగితే బాగుండేది అన్నాడు. సల్మాన్ ఖాన్ ను గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించాన్ని పట్ల క్రీడాకారులు, నిపుణులు, విశ్లేషకులు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. క్రీడారంగానికి చెందిన వారు ఎవరూ దొరకలేదా అంటూ మండిపడ్డారు.
ఈ వివాదం గురించి అడగ్గా.. సల్మాన్ విభిన్నంగా స్పందించాడు. 'ఈ వివాదం ఎక్కువకాలం కొనసాగాలని కోరుకున్నాను. ఎందుకంటే రియో ఒలింపిక్స్ గురించి అందరూ తెలుసుకుంటారు. సచిన్ క్రికెట్ ఆడతాడు, రెహ్మాన్ మ్యూజిక్ వాయిస్తాడు. వీళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడంపై ఎటువంటి వివాదం లేదు. నన్ను రాయబారిగా నియమించడంపై వివాదం చేయడం నిరుత్సాహపరిచింద'ని సల్మాన్ ఖాన్ సమాధానం ఇచ్చాడు.