శంకర్ గారూ...నాకూ అవకాశం ఇవ్వండి
‘‘నేను ఇక్కడికి అవకాశం కోసం వచ్చాను. శంకర్ గారూ... మీ దర్శకత్వంలో నటించే అవకాశం నాకూ కల్పించండి’’ అని హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ వ్యాఖ్యానించారు. స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందుతోన్న ‘ఐ’ చిత్రం పాటల విడుదల కోసం సోమవారం ప్రత్యేకంగా చెన్నైకి వచ్చిన ఈ కండల వీరుడు పై విధంగా వ్యాఖ్యానించారు. ఆర్నాల్డ్ ప్రసంగిస్తూ, ‘‘నేను చెన్నైకి తొలిసారిగా వచ్చాను. చెన్నై అందమైన నగరం. ఇక్కడి ప్రజలు మంచి కళాపోషకులు’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య అన్నారు. అలాగే, ‘‘ఈ ‘ఐ’ చిత్రంలో బాడీబిల్డర్స్‌కు అవకాశం ఇచ్చారు.
చాలా సంతోషం. ఎందుకంటే నేను మొదట బాడీబిల్డర్‌గానే సినీ రంగ ప్రవేశం చేశాను’’ అని ఆయన తన సినీ రంగపు తొలినాళ్ళను గుర్తు చేసుకున్నారు. ‘‘ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ.. ‘‘శంకర్ గొప్ప దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నటించాలని ఆశగా ఉంది. ‘ఐ’ చిత్రం అద్భుతాల నిలయంగా ఉంటుందని అనిపిస్తోంది’’ అని చెప్పి, సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలిమ్స్ దాదాపు రూ. 180 కోట్ల వ్యయంతో, ఎన్నో నెలలుగా శ్రమించి నిర్మించిన ప్రతిష్ఠాత్మక ‘ఐ’ చిత్రంలో విక్రమ్ హీరోగా నటించగా, అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించారు.
ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. పాటల సీడీని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆవిష్కరించగా, తొలి ప్రతిని కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ వింత మృగం వేషం ధరించి వేదికపై ఒక పాటకు నటించడం విశేషం. అలాగే, ఏ.ఆర్. రెహ్మాన్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సైతం ఆడియో ఆవిష్కరణ వేదికపై పాడారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే విడుదల చేయనున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్‌తో కలిసి ఆస్కార్ సంస్థే తెలుగులోనూ విడుదల చేయనుంది.