ఒకవేళ నేను 70 ఏళ్లకే చనిపోతే..అప్పుడు నా పిల్లలు?! | If I die at 70, my child will be without a father at 15: Salman reveals innermost fears! | Sakshi
Sakshi News home page

ఒకవేళ నేను 70 ఏళ్లకే చనిపోతే..అప్పుడు నా పిల్లలు?!

Published Thu, Jul 17 2014 11:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఒకవేళ నేను 70 ఏళ్లకే చనిపోతే..అప్పుడు నా పిల్లలు?! - Sakshi

ఒకవేళ నేను 70 ఏళ్లకే చనిపోతే..అప్పుడు నా పిల్లలు?!

 ‘‘నాకు బిడ్డలు కావాలని ఉంది. కానీ, బిడ్డతో పాటు తల్లిని కూడా భరించాలి. నేను మంచి తండ్రిని కాగలుగుతాను. అయితే, మంచి భర్తను ఎప్పటికీ కాలేను. ‘ఏం ఫర్వాలేదు.. మా ఆయన్ను నేను మార్చుకుంటా’ అని కొంతమంది ఆడవాళ్లు అంటారు. నన్ను మాత్రం ఎవరూ మార్చలేరు’’ అని సల్మాన్‌ఖాన్ చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ తన మనసు విప్పి, కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతూ -‘‘ఏ తల్లీ తండ్రికైనా తమ బిడ్డలకు పెళ్లి చేయాలని, మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకోవాలనీ ఉంటుంది. మా అమ్మానాన్నకు కూడా నా పిల్లలను చూడాలని కోరిక.
 
  నాక్కూడా పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లంటే నాకిష్టం లేకపోయినా పిల్లల కోసం పెళ్లాడాలని ఉంది. సరే.. పెళ్లి చేసుకున్నాననుకోండి.. పిల్లలు పుడతారు. కానీ, నాకు 80 ఏళ్లు వయసు వచ్చేసరికి వారికి 25, 30 ఏళ్లు ఉంటాయి. అప్పటివరకూ నేను బతికి ఉంటే నా పిల్లలను చూసుకోగలను. ఒకవేళ నేను 70 ఏళ్లకే చనిపోయాననుకోండి... అప్పుడు నా పిల్లలకు 15 ఏళ్లు ఉంటాయి. ఆ వయసు నుంచి నా పిల్లలు తండ్రి లేకుండా బతకాల్సి వస్తుంది. అది ఊహించడానికే బాధగా ఉంది’’ అని చెప్పారు. పోనీ.. పెళ్లి చేసుకోకుండా సరోగసీ విధానం ద్వారా బిడ్డను కనాలంటే అది కూడా సల్మాన్‌కి భయంగా ఉందట.
 
 దాని గురించి చెబుతూ -‘‘సరోగసీ బేబీని పొందాననుకోండి.. కచ్చితంగా ఆ బిడ్డను కన్న తల్లి నాతో పాటు ఉండదు. జన్మనివ్వడం వరకే అని ఒప్పందం కుదుర్చుకుంటాం. కానీ, పెద్దయ్యే కొద్దీ బిడ్డలకు తల్లి మీద చాలా మమకారం ఉంటుంది. అప్పుడు నా బిడ్డ ‘మా అమ్మ ఎవరు?’ అని అడిగితే, నేను తెల్లమొహం వేయాల్సి వస్తుంది’’ అన్నారు సల్మాన్ ఖాన్. మొత్తానికి ఈ కండలవీరుడు పెళ్లి, పిల్లల విషయంలో చాలా సతమతమవుతున్నారని అర్థమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement