
బాలుకు లీగల్ నోటీస్ పంపిన ఇళయరాజా
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లీగల్ నోటీసులు పంపారన్న వార్త సంగీత అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం సినిమా పాటల పాడటానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించని బాలు.. ఇతర దేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్లను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇతర సంగీత దర్శకులు సారధ్యంలో ఆయన పాడిన పాటలను వేదిక మీద పాడి అభిమానులను అలరిస్తుంటారు.
అయితే కొంత కాలంగా తను కంపోజ్ చేసిన పాటల రైట్స్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ఇళయరాజా, అంతర్జాతీయ వేదికల మీద తన అనుమతి లేకుండా, తాను కంపోజ్ చేసిన పాటలు పాడటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు కాదు ఇలాంటి ఈవెంట్లను తరుచూ నిర్వహిస్తున్న ఎస్ బి బాలసుబ్రమణ్యంతో పాటు గాయని చిత్ర, ఎస్ పి కుమార్ చరణ్లకు లీగల్ నోటీసుల పంపిచారు. ఇక మీదట తన అనుమతి లేకుండా తన పాటలను ప్రదర్శనలలో ఆలపిస్తే చట్టపరమైన చర్యలు కుంటామని తెలిపారు.
తనకు లీగల్ నోటీసులు వచ్చిన విషయాన్ని బాలు ధృవీకరించారు. ఇటీవల టొరంటో, రష్యా, దుబాయ్లలో జరిగిన పలు వేడుకల్లో తాను ఇళయరాజా గీతాలను ఆలపించానని కానీ అమెరికాలో చేసే కన్సర్ట్కు మాత్రమే రాజా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావటం లేదన్నారు. అదే సమయంలో తన ట్రూప్ లోని ఇతర గాయకులకు ఇకపై ఇళయారాజా గీతాలను స్టేజ్ పై పర్ఫామ్ చేయవద్దని సూచించినట్టుగా తెలిపారు.