
ఇళయరాజా
పెరంబూరు: సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి వివాదాల్లో చిక్కున్నారు. సంగీతజ్ఞానిగా వాసికెక్కిన ఆయన తరుచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తన పేరును తానే తగ్గించుకుంటున్నారనే వాదన సినీ వర్గాలో వినిపిస్తోంది. సంగీత దర్శకుడిగా ఖ్యాతిగాంచిన ఇళయరాజా ఆ మధ్య తన పాటల రాయల్టీ వ్యవహారంలో కోర్టుకెక్కి అభాసుపాలయ్యారు. తన పాటలను ఎవరు, ఎలాంటి కార్యక్రమంలో వాడుకున్నా అందుకు తగిన రాయల్టీని తనకు చెల్లించాలంటూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొన్ని రికార్డింగ్ కంపెనీలపై ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లు కొట్టివేతకు గురయ్యాయి. పాటల కచేరీల్లోనూ తన పాటలను పాడరాదన్న విషయంలో ఇళయరాజాకు, గాయకుడు ఎస్‌పీ.బాలసుబ్రమణ్యంకు మధ్య పెద్ద మరస్పర్ధలకే దారి తీసింది. అవి ఇటీవలే సమసిపోయి, త్వరలో మళ్లీ ఇద్దరూ ఒకే వేదికపై కలవనున్నారనుకోండి. అసలు ఇళయరాజా సంగీతాన్ని అందించినందుకు పారితోషికం ఇస్తున్నామని, మళ్లీ పాటలకు రాయల్టీ ఏమిటని నిర్మాత కే.రాజన్ ప్రశ్నించడంతో పాటు ఆయన చర్యల్ని తప్పు పట్టారు. నిజానికి డబ్చు ఖర్చు పెట్టి, సంగీత దర్శకుడికి పారితోషికం చెల్లించిన నిర్మాతకు పాటల రాయల్టీలో భాగం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా మరి కొందరు నిర్మాతలు కూడా ఇళయరాజా పాటలపై రాయల్టీ అడగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తాజాగా ఇళయరాజా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లోనూ రీమేక్ కానుంది. కాగా 96 చిత్రంలో ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాత చిత్రాల్లోని పాటలను పొందుపరిచారు. అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చిన మెహందీ సర్కస్ చిత్రంలోనూ ఇళయరాజా పాత పాటలను పొందుపరిచారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఇళయరాజా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను సంగీతాన్ని సమకూర్చిన పాటలను కొత్త చిత్రాల్లో వాడుకున్న వాళ్లు మగతనం లేనివారే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఇళయరాజా వ్యాఖ్యలకు 96 చిత్ర వర్గాలు గట్టిగానే బదులిచ్చారు. తమ చిత్రంలో వాడిని ప్రతి పాటకు రాయల్టీ చెల్లించినట్లు వారు తెలిపారు. కాగా ఇళయరాజా వైఖరిని నెటిజన్లు మాత్రం ఎండగడుతున్నారు. ఇళయరాజా తన సంకుచిత మనస్తత్వాన్ని వీడాలంటూ ఏకేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు చాలా చిత్రాల్లో పాత చిత్రాల్లోని పాటలను వాడుకున్న సందర్భాలు ఉన్నాయని, అప్పుడు ఆయన మగతనం లేనివాడా? అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఏఆర్.రెహ్మాన్‌కు ఇళయరాజాకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment