రవితేజకు ‘ఇడియట్’లా...
‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు ఇలియానా. బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తెలుగు సినిమాకు ఇక ఇలియానా దూరమైపోయినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో నాగశౌర్య, అవికా గోర్ జంటగా నంద్యాల రవి దర్శకత్వంలో మామిడిపల్లి గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఆడియో వేడుకలో తళుక్కున మెరిశారు. ఆ సినిమాకు సంబందించిన ప్రచార చిత్రాలను ఆవిష్కరించారామె. ఈ చిత్ర నిర్మాత మామిడిపల్లి గిరిధర్ మంచి వ్యక్తి అనీ, ఈ వేడుక గొప్ప అనుభూతినిచ్చిందని ఇలియానా అన్నారు. కె.ఎం.రాధాకృష్ణన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను అవికా గోర్ తల్లి చేతన్‌గోర్ ఆవిష్కరించి నాగశౌర్య తల్లి ఉషకు అందించారు.
నంద్యాల రవి మాట్లాడుతూ -‘‘కె.ఎం.రాధాకృష్ణన్ సంగీత విద్వాంసుడు. ఈ చిత్రానికి యాభై శాతం బలాన్ని ఆయనే ఇచ్చారు. దర్శకునిగా అవకాశమిచ్చిన గిరిధర్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. పాతికేళ్లుగా సినిమా జర్నలిస్ట్‌గా పనిచేసిన తాను అన్ని విషయాల్లోనూ విజయాలు సాధించాననీ, సినీ రంగంలో నిరూపించుకోవడమే తరువాయి అనుకున్నప్పుడు నిర్మాతగా మారాలని నిశ్చయించుకున్నాననీ, రవితేజకు ‘ఇడియట్’లా నాగశౌర్యకు ఈ చిత్రం నిలిచిపోతుందనీ, డిసెంబర్ 5న సినిమాను విడుదల చేస్తామనీ గిరిధర్ తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. అతిథులుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్, సి.కల్యాణ్, శాసనసభ్యురాలు రేఖా నాయక్ ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.