![Imaikka Nodigal Release Date Announced - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/1/Nayanatara.jpg.webp?itok=u1p9u37w)
తమిళసినిమా: అగ్రనటిగా రాణిస్తున్న నటి నయనతార. లేడీ సూపర్‌స్టార్ పట్టాన్ని కూడా అందుకున్న ఈ బ్యూటీ చేతిలో స్టార్స్‌తో నటిస్తున్న చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అంటూ అరడజనుకుపైనే ఉన్నాయి. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి, అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార త్వరలో కమలహాసన్‌తో ఇండియన్ 2 చిత్రంలో జత కట్టడానికి రెడీ అవుతోంది. అంత క్రేజ్ ఉన్న నటి చిత్రాలు చూడాలని సగటు ప్రేక్షకుడికి ఉంటుంది.
అలాంటిది అరమ్ చిత్రం తరువాత ఆమె నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. ఇది ఆమె అభిమానులకు కాస్త నిరాశ పరచే విషయమే. అయితే నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు ఇమైకా నొడిగళ్, కొలమావు కోకిల త్వరలో వరుసగా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇమైకా నొడిగళ్ చిత్రంలో నయనతార సీబీఐ అధికారిగా ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషించింది. అదేవిధంగా కొలమావు కోకిల చిత్రంలో డ్రగ్స్ స్మగ్లర్‌గా నటించింది.
ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌బోర్డు దీనికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. నయనతార నటించిన ఈ రెండు చిత్రాలపైనా భారీ అంచనాలే నెలకొన్నాయి. వీటిలో కొలైమావు కోకిల జూలైలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇమైకా నొడిగళ్ చిత్రాన్ని నిర్మాతలు జూలై చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడియో ఆవిష్కరణ వేదికపై వెల్లడించారు. మొత్తం మీద నయనతార చిత్రాలు త్వరలో వరుసగా థియేటర్లలో సందడి చేయబోతున్నాయన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment