iSmart Shankar Review, in Telugu | ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ | Puri Jagannadh, Ram Pothineni - Sakshi
Sakshi News home page

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

Jul 18 2019 10:51 AM | Updated on Jul 27 2019 12:59 PM

iSmart Shankar Telugu Movie Review - Sakshi

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి, రామ్‌లను ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ గట్టెక్కించాడా.?

టైటిల్ : ఇస్మార్ట్ శంకర్‌
జానర్ : మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌
నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ

హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌.. ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇస్మార్‌ శంకర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రామ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో కొత్త క్యారెక్టర్‌లో చూపించాడు పూరి. ట్రైలర్‌లు, సాంగ్స్‌ సినిమాకు మాస్‌ ఇమేజ్‌ తీసుకువచ్చాయి. మరి ఆ అంచనాలను ఇస్మార్ట్‌ శంకర్‌ అందుకున్నాడా..? రామ్‌, పూరీలకు ఆశించిన సక్సెస్‌ దక్కిందా..?

కథ :
శంకర్‌ (రామ్‌ పోతినేని) ఓల్డ్ సిటీలో సెటిల్మెంట్స్‌ చేసే కుర్రాడు. ఓ డీల్ విషయంలో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే పొలిటీషియన్‌ కాశీ విశ్వనాథ్‌ని చంపిన కేసులో జైలుకు వెళతాడు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్‌ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు సైంటిస్ట్‌ పింకీ (నిధి అగర్వాల్‌). అసలు శంకర్‌ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.? పొలిటీషియన్ కాశీ విశ్వనాథ్‌ని శంకరే చంపాడా? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్‌ అరుణ్‌ (సత్యదేవ్‌)కి సంబంధం ఏంటి?

నటీనటులు :
సరికొత్త మేకోవర్‌లో డిఫరెంట్‌ యాటిట్యూడ్‌, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఇబ్బంది పడినా ఓవరాల్‌గా శంకర్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మాస్‌ యాక్షన్‌ సీన్స్‌లో రామ్ పర్ఫామెన్స్‌ సూపర్బ్ అనేలా ఉంది. హీరోయిన్లుగా నభా, నిధి అగర్వాల్‌ గ్లామర్‌ షోలో పోటి పడ్డారు. కథలోనూ ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలు కావటంతో నటనతోనూ ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్రలో అలరించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమకు అలవాటైన పాత్రల్లో ఈజీగా నటించారు.

విశ్లేషణ :
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్‌ సినిమా చేశాడు. గత చిత్రాల తరహాలో చూట్టేయకుండా కాస్త మనసుపెట్టి సినిమాను తెరకెక్కించినట్టుగానే అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్న తరుణంలో పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పూరి. ఓ పాట, ఓ ఫైట్ అన్న ఫార్ములాకు తన మార్క్‌ టేకింగ్‌ను జోడించి సినిమాను తెరకెక్కించాడు. కథ కొత్తగా ఉన్నా కథనం విషయంలో మాత్రం తన రొటీన్‌ స్టైల్‌నే ఫాలో అయ్యాడు.

పూరి తన మూస ఫార్ములా నుంచి ఇంకా  బయటపడలేదనే చెప్పాలి. గత చిత్రాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమా కాస్త ఎంగేజింగ్‌గానే తెరకెక్కించాడు. మాస్‌, యూత్‌ ఆడియన్స్‌ను అలరించే డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మణిశర్మ మ్యూజిక్‌ సినిమాకు ప్రధానబలం. తన మ్యూజిక్‌తో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు మణి. కొన్ని సీన్స్‌లో నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలు బాగున్నా.. కథలో కావాలని ఇరికించినట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
రామ్‌ పోతినేని పర్ఫామెన్స్‌
మాస్ ఎలిమెంట్స్‌
మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌ :
రొటీన్ కమర్షియల్ ఫార్ములా
స్క్రీన్‌ ప్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement