ఇది నా జీవితంలో అరుదైన సంఘటన!
‘‘హీరో ఇమేజ్ కంటే క్యారెక్టర్ ఇమేజ్ తక్కువయితే... హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయాలి. శాతకర్ణిలో అలాంటి డైలాగులు రాసే అవసరం రాలేదు’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ నెల 12న రిలీజవుతోంది. సాయిమాధవ్ చెప్పిన సంగతులు...
► ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత క్రిష్‌గారు శాతకర్ణిపై పరిశోధన ప్రారంభించారు. హిందీలో ‘గబ్బర్’, తర్వాత తెలుగులో ‘కంచె’ చేస్తూనే క్రిష్ రీసెర్చ్ కొనసాగించారు. ఆయన నాతో చెప్పిన తర్వాత నేనూ రీసెర్చ్ చేశా. తెనాలిలో ‘యజ్ఞశ్రీ శాతకర్ణి’కి ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖల ద్వారా అప్పటి సంస్కృతి తెలిసింది.
► చిన్న చిన్న గణరాజ్యాలుగా ఉన్న భారతావనిని ఓ దేశంగా మార్చడానికి శాతకర్ణి ఎలాంటి యుద్ధం చేశాడనేది ఈ చిత్రకథ. శాతకర్ణికున్న బిరుదుల్లో ‘త్రిసముద్ర తోయపాన వాహన’ ఒకటి. ‘మూడు సముద్రాల్లోనూ నీళ్లు తాగిన గుర్రాలను అధిరోహించినవాడు’ అని అర్థం. ఓటమి ఎరుగని శాతకర్ణి విజయగాథ – ఈ చిత్రకథ.
► కథ సిద్ధమైన తర్వాత ‘బాలకృష్ణగారు తప్ప ఇంకెవరూ శాతకర్ణి పాత్రను చేయలేరేమో’ అనంటే... ‘ఆల్రెడీ నేను మాట్లాడాను. ఆయనే చేస్తున్నారు’ అన్నారు క్రిష్. చరిత్రలో జరిగింది చెబుతున్నాం. కథలో కల్పితాలు ఏం లేవు.
► తొలిసారి మొరాకో సెట్స్‌లో బాలకృష్ణగారికి డైలాగులు చెప్పడానికి వెళ్లినప్పుడు నాకు భయం వేసింది. 99 సినిమాల్లో మహానుభావులు రాసిన డైలాగులు చెప్పారాయన. నా డైలాగులు నచ్చుతాయో? లేదో? అనుకున్నా. ఆయన ఒక్క డైలాగ్ కూడా మార్చమనలేదు. శాతకర్ణి శక్తిమంతుడు కావడంలో మంచి డైలాగులు పడ్డాయి.
► ‘ఖైదీ నంబర్ 150’లో కొన్ని సీన్లకు డైలాగులు రాశా. చిన్నప్పట్నుంచీ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు చూస్తూ ఇక్కడి వరకూ వచ్చా! వాళ్లే నాకు స్ఫూర్తి. వాళ్ల ప్రయాణంలో మైలురాళ్లుగా నిలిచే చిత్రాలకు మాటలు రాయడం అదృష్టం. ఎవరూ కలలు కనే ధైర్యం కూడా చేయని అరుదైన సంఘటన నా జీవితంలో జరిగింది. సావిత్రి గారి జీవితకథతో నాగ అశ్విన్ తీయబోయే ‘మహానటి’కి, హీరో సందీప్‌కిషన్–మంజుల సినిమాకి మాటలు రాస్తున్నా.