
బ్రూస్ లీ దర్శక, నిర్మాతలపై ఐటీ ఎటాక్
హైదరాబాద్ : నిన్న కోలివుడ్ ...తాజాగా టాలీవుడ్పై ఐటీ శాఖ కన్నేసింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రూస్ లీ చిత్రమే ప్రధాన లక్ష్యంగా సినిమా రంగంపై ఆదాయపు పన్నుశాఖ గురువారం పంజా విసిరింది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.
కాగా రామ్ చరణ్ హీరోగా రూ. 50కోట్లు బడ్జెట్తో తెరకెక్కిన బ్రూస్ లీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనువైట్ల, దానయ్య నివాసాలతో పాటు, వారి కార్యాలయాలు, వారి సమీప బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా కొద్దిరోజుల క్రితం పులి చిత్ర హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించింది. నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మదురై అన్బు ఇళ్లలో సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.