పద్ధతులు మారాయ్!
ఆ కుర్రాడికి మొక్కలంటే ప్రాణం. వాటిని కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంకో పెద్దాయనకు మనుషులంటే ప్రాణం. ఇద్దరూ కలిశారు. మొక్కలతో పాటు మనుషులను కాపాడితే సమాజం అందంగా ఉంటుందని కుర్రాడిని జనతా గ్యారేజ్‌లోకి ఆహ్వానించాడు. అతడి రాకతో గ్యారేజ్‌లో పద్ధతులు కూడా మారతాయ్. ఇద్దరూ కలిసి వెహికిల్స్‌తో పాటు మనుషుల కష్టాలను రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు.
అప్పుడేం జరిగింది? అసలు వీరి లక్ష్యం ఏంటి? దాన్ని ఎలా చేరుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఇచట అన్నీ రిపేరు చేయబడును... అనేది ఉపశీర్షిక. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ కథానాయికలు. సోమవారంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేశారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
‘‘ఎన్టీఆర్, మోహన్‌లాల్ కలయికలో సన్నివేశాలు, వారిద్దరి నటన చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకుడి గత చిత్రాల తరహాలో వాణిజ్య హంగులతో కూడిన సందేశాత్మక చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్’’ అన్నారు నిర్మాతలు. మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: తిరు.