
పండగే పండగ
మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడాయన దృష్టి మొత్తం విజయంపైనే. అందుకే... కసితో ‘రభస’ సినిమా చేస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం ‘రభస’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఆగస్ట్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమా గురించి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘‘రభస’లో ఎన్టీఆర్ సామాన్యులను ఎంతో ఆకట్టు కుంటారు.
యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఆయన పాత్ర చిత్రణ సాగుతుంది. అందరూ అయిదారుసార్లు చూసేంత వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. అభిమానులకైతే పండుగలా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రం బెల్లంకొండ సురేశ్ మేకింగ్ సత్తాను తెలియజేస్తుంది’’ అని చెప్పారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాదు, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని బెల్లంకొండ సురేశ్ తెలిపారు. సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలందిస్తున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...
ఎన్టీఆర్ వేగం పెంచారు. ‘రభస’ తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. పూరి జగన్నాథ్‌తో ఓ చిత్రానికి పచ్చజెండా ఊపారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి బండ్ల గణేశ్ నిర్మాత. ‘‘మా సంస్థ నిర్మించిన ‘బాద్‌షా’ చిత్రం తారక్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ సినిమా సమయంలోనే మా సంస్థలో మరో సినిమా చేస్తానని ఆయన మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సినిమా చేయనున్నారు.
ఎన్టీఆర్-పూరీజగన్నాథ్ లాంటి క్రేజీ కాంబినేషన్‌తో చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తా’’ అని గణేశ్ తెలిపారు. ఈ రెండు చిత్రాలతో పాటు పీవీపీ సంస్థ నిర్మించనున్న చిత్రంలో కూడా ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రంలో నాగార్జునతో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి మల్టీస్టారర్ ఇదే కావడం విశేషం.