
జీఎస్‌టీ వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బంది
‘‘నా బాల్య మిత్రుడు, క్లాస్‌మెట్ పట్టాభికి సినిమా అంటే ప్యాషన్. చిత్ర పరిశ్రమలో తనకు ఎవరూ తెలిసినవారు లేరు. సినిమాపై ఇష్టంతో సురేశ్‌బాబుగారికి ఓ ఉత్తరం రాయడంతో, ఆయన పెద్ద మనసుతో పట్టాభిని తన సంస్థలో చేర్చుకున్నారు’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. సాయి రోనక్, హరీష్, పూజ ముఖ్య పాత్రల్లో పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాదలి’. ప్రసన్ ప్రవీణ్ శ్యాం స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను కేటీఆర్ రిలీజ్ చేసి, నిర్మాత సురేశ్‌బాబు, హీరో రామ్‌చరణ్‌కి అందించారు.
కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘మిత్రుడు రామ్‌చరణ్‌ని అడగ్గానే ఈ ఫంక్షన్‌కి వచ్చాడు. ‘కాదలి’ టీం కొత్తవారైనా చక్కగా చేశారు. కథే కింగ్. బాగుంటే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం ‘పెళ్లి చూపులు’ చిత్రం నిరూపించింది. ‘బాహుబలి’ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచింది. అమెరికాలోని కాలిఫోర్ని యాకి వెళ్లినప్పుడు ‘బాహుబలి’ చూశాం అని అక్కడి వాళ్లు చెప్పడం గర్వంగా అనిపించింది. సినిమా రంగానికి 28 శాతం జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) విధించడం వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బందే. కమల్‌హాసన్‌గారు కూడా ఇదే విషయాన్ని రైజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి అందరూ వెళ్లి కేంద్ర మంత్రి అరుణŠ æజైట్లీని కలిసి పన్ను తగ్గించాలని కోరదాం.
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది’’ అన్నారు. హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు చనిపోయాక జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది. కాబట్టి అందరూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ‘కాదలి’ విజువల్స్ చూస్తే నా ‘ఆరెంజ్’ చిత్రం అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. నా తొలి చిత్రంలో నేను ఇంత బాగా చేసి ఉండను. యాక్టర్స్ కొత్తవారైనా పది సినిమాలు చేసిన అనుభవం ఉన్నవారిలా చేశారు. ఈ సినిమా ఎప్పు డెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు.
‘‘ఇప్పుడు మనం 7 నుంచి 14 పర్సెంట్ పన్నులో ఉన్నాం. జీఎస్‌టీ 28 శాతం అంటే రీజనల్ సినిమాలు చాలా నష్టపోతాయి’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. ‘‘ఒక తెలుగు సినిమాకి తమిళ టైటిల్ పెట్టినప్పుడే ఈ మూవీ ప్రత్యేకమని అర్థమైంది. ‘హ్యాపీడేస్, పెళ్లిచూపులు’లా ‘కాదలి’ కూడా హిట్ ఇవ్వాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు.
పట్టాభి మాట్లాడుతూ – ‘‘నాకు íసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశమిచ్చిన సురేశ్‌బాబుగారికి థ్యాంక్స్. నా మిత్రుడు కేటీఆర్ ఇక్కడికొచ్చి నన్ను సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. చిరంజీవిగారికి ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్‌లో రామ్‌చరణ్‌గారు డ్యాన్స్‌లో ఉర్రూతలూగిస్తున్నారు. ‘కాదలి’ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. సాయి రోనక్, హరీష్, పూజ, దర్శకులు దశరథ్, వీరూ పోట్ల, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్, పాటల రచయిత వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ రంగా, కెమెరామేన్ శేఖర్ వి.జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.