
విమానంలో ఆయనతో కబుర్లే కబుర్లు
కాజల్ అగర్వాల్ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఈ ఆనందానికి కారణమేమిటంటే... ఇటీవలే హైదరాబాద్ రావడానికి ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు కాజల్. విమానం అరగంట ఆలస్యం అని తెలియడంతో సెలబ్రిటీ టెర్మినల్‌కి చేరుకున్నారు. అయితే... అక్కడ తీరిగ్గా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తిని చూడగానే కాజల్‌కి సంతోషం కట్టలు తెంచుకుంది. అమాంతం ఆ వ్యక్తి దగ్గరకెళ్లి ‘‘సార్... నేను మీ ఫ్యాన్‌ని’’ అంటూ పరిచయం చేసుకున్నారట. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే... సల్మాన్‌ఖాన్. యాదృచ్ఛికంగా సల్మాన్ కూడా హైదరాబాద్ ఫ్లయిట్ కోసమే వెయిటింగ్.
సల్మాన్‌తో కలిసి హైదరాబాద్ దాకా ప్రయాణం చేయొచ్చని తెలీగానే.. ఆనందంతో కాజల్ ఉబ్బితబ్బిబ్బయిపోయారట. ఫ్లయిట్ రాగానే... సల్మాన్ పక్క సీట్ వ్యక్తిని రిక్వెస్ట్ చేసి మరీ... సల్మాన్ పక్కన చేరారట. ఇంకేముంది... హైదరాబాద్ వచ్చేదాకా కబుర్లే కబుర్లు. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ చెబుతూ -‘‘చిన్నప్పట్నుంచీ సల్మాన్ వీరాభిమానిని నేను. ఫ్లయిట్‌లో తనతో సన్నిహితంగా మెలిగాను. విమానంలో ఉన్నంతసేపూ కబుర్లు చెప్పాను. ఆ క్షణాలు నా జీవితంలో మరచిపోలేనివి. నిజంగా నేను లక్కీ. తను చాలా పద్ధతైన మనిషి’’ అంటూ కితాబులిచ్చేశారు.