వంద ఎకరాల భారీ సెట్‌లో గరుడ
చియాన్ విక్రమ్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి తన తాజా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి గరుడ అనే టైటిల్‌ను నిర్ణయించారు. విక్రమ్ ప్రస్తుతం ఇరుముగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార తొలిసారిగా విక్రమ్‌తో జత కడుతున్నారు. మరో హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తున్న ఇరుముగన్ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది. విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. గరుడ పేరుతో రూపొందనున్న ఆ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని తిరు నిర్వహించనున్నారు.
ఇందులో విక్రమ్ సరసన నటి కాజల్‌అగర్వాల్ నటించనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందనున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. కాజల్ అగర్వాల్ ఇందులో కోయంబత్తూర్ జిల్లా అమ్మాయిగా నటించనున్నారు. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఈ బ్యూటీ ఇంతకు ముందు నటించలేదన్నది గమనార్హం. యాక్షన్ అంశాలతో ఫక్తు కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సిల్వర్ లైన్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. ఇందులో మహేశ్ మంజ్రేకర్ విలన్‌గా నటించనున్నారు. ఈయన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అన్నది గమనార్హం.
ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, కరుణాస్ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రం కోసం చెన్నై, శ్రీపెరంబదూర్ సమీపంలో వంద ఎకరాల ను అద్దెకు తీసుకుని బ్రహ్మాండమైన సెట్ వేశారు. అందులో ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఆ తరువాత పొల్లాచ్చి, కోవై, అహ్మదాబాద్, లక్నో తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అదే విధంగా చిత్ర అధిక భాగం షూటింగ్‌ను అరబ్ దేశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు.